బావగారి కన్ను పడింది – రాహుల్ పై స్మృతీ ఇరానీ సెటైర్లు

లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించాయి. ప్రచారాన్ని కూడా తారా స్థాయికి తీసుకెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనకు వెనుకాడుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర ప్రదేశ్ వరకు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడి ఉంది. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ కు కంచుకోటలుగా ఉన్న అమేఠీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వెదుక్కుంటోందా లేక ఒక నిర్ణయానికి వచ్చిందా అన్నది అర్థం కావడం లేదు.

రాహుల్ కర్చిఫ్ వేశారా..లేదా….

అమేఠీ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ మూడు సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2019లో మాత్రం కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా వాయినాడ్ (కేరళ) గెలిచి పరువు దక్కించుకున్నారు. ఈ సారి కూడా వాయినాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్… అమేఠీ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దానితో ప్రస్తుత ఎంపీ స్మృతీ ఇరానీ ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. రాహుల్ గాంధీ, అమేఠీ సీటుపై కర్చిఫ్ వేసి తిరుగుతున్నారని,అయితే ఆయన బావగారైన రాబర్ట్ వాధ్రా (ప్రియాంకాగాంధీ భర్త) దానిపై కన్నేశారని ఆమె అన్నారు. అమేఠీలో పోటీ చేయాలని రాహుల్ కు ఆమె సవాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ 15 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని తాను ఐదేళ్లలో చేసి చూపించానని ఆమె ప్రకటించారు…

జూనియర్ గాంధీ భయపడుతున్నారా…?

సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన తర్వాత రాహుల్ ఆ నియోజకవర్గానికి వచ్చారు. ఒక్క ఓటమితో రాహుల్ పూర్తిగా కృంగిపోయారని చెప్పాలి. ఈ సారి పోటీ చేయాలా వద్దా అని ఆలోచిస్తుండగానే వాధ్రా ఎంట్రీ ఇచ్చి అమేఠీ ప్రజలు కోరుకుంటే తాను బరిలోకి దిగుతానని చెప్పుకున్నారు. పైగా భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిపైనే క్లారిటీకి రాని పరిస్థితుల్లో స్మృతీ ఇరానీ మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. దమ్ముంటే వీధుల్లోకి రండి అంటూ కాంగ్రెస్ పార్టీని కవ్విస్తున్నారు.

వాయినాడ్ నుంచి కూడా పారిపోతారు – ప్రధాని మోదీ…

అమేఠీ పోటీ విషయంలో రాహుల్ గాంధీ ఆచి తూచి మాట్లాడుతున్నారు. పార్టీ నిర్ణయానుసారం నడుచుకుంటానని ఆయన అంటున్నారు. మే 20న అమేఠీలో పోలింగ్ జరుగుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు మే 3 ఆఖరు తేదీ అవుతుంది. ఏప్రిల్ 26న వాయినాడ్ పోలింగ్ తర్వాత రాహుల్ అమేఠీపై దృష్టి పెట్టే అవకాశం ఉండొచ్చు. అయితే రాహుల్ కు ఈ సారి ఎక్కడా గెలిచే సీన్ లేదని, వాయినాడ్లో కూడా ఓడిపోయి పలాయనం చిత్తగిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఉంటూ,ప్రజలకు సేవ చేసే అలవాటు రాహుల్ కు లేదని ఆయన అన్నారు…