బీజేపీలో లవ్లీ జాయినింగ్స్….

ఎన్నికల వేళ కాంగ్రెస్ పరిస్థితి కకావికలమైపోయింది. పార్టీలో ఉండే కంటే వెళ్లిపోయేందుకే నేతలు ఇష్టపడుతున్నారు. ఢిల్లీలో పార్టీ ఖాళీ అయిపోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు నచ్చక కొందరు బహిరంగ విమర్శలు చేస్తుంటే, మరికొందరు చడీ చప్పుడు లేకుండా వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పార్టీలో వారికంటే బయట వారికి ఎక్కువ ప్రాధాన్యమిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల టికెట్ల పంపిణీ విషయంలోనూ నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి..

కమలతీర్థం పుచ్చుకున్న అర్వింద్ సింగ్ లవ్లీ

ఇంతకాలం అరవింద్ సింగ్ లవ్లీ..ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడిగా ఉండేవారు. రెండు రోజుల క్రితం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆప్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్న తీరు తనకు నచ్చలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. గెలిచే అవకాశాలున్న స్థానాలను సైతం ఆప్ కు వదిలేశారని ఆయన ఆరోపించారు. కార్యకర్తల మనోభావాలకు గౌరవమివ్వడం లేదని, అగ్రనాయకత్వం తమను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రెండు రోజుల్లోనే అరవింద్ సింగ్ లవ్లీ …బీజేపీలో చేరారు. తనతో పాటు రాజ్ కుమార్ చౌహాన్, నసీబ్ సింగ్, నీరజ్ బొసాయా, అమిత్ మాలిక్ ను కూడా బీజేపీలోకి తీసుకెళ్లారు. బీజేపీలో చేర్చుకున్నందుకు ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

బీజేపీని గెలిపిస్తామంటున్న అరవింద్ సింగ్…

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందని, అభివృద్ధి పరుగులు తీస్తోందని అరవింద్ సింగ్ అన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీ ప్రజల సంక్షేమానికి బీజేపీ ఒక్కటే పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో మూడో సారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుందని, త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీలో కూడా బీజేపీ ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని ప్రజలు మోదీ పాలనను మెచ్చుకుంటున్నారని ఆయన విశ్లేషించారు..

ఆప్ పై పెరుగుతున్న వ్యతిరేకత…

ఢిల్లీలో ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హవా నడిచింది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం బయట పడిన తర్వాత ఆప్ నేతలను జనం అసహ్యించుకుంటున్నారు.మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయినప్పటికీ ఢిల్లీ ప్రజలు పెద్దగా స్పందించినదీ లేదు. అవినీతి చేశారు..జైలుకు వెళ్లారు…అన్నట్లుగానే వాళ్లు భావిస్తున్నారు. ఆప్ చేపట్టిన ధర్నాలకు పెద్దగా మద్దతు రాకపోవడంతో అవి కూడా నీరుగారి పోయాయి. నిజమైన అవినీతి రహిత సమాజాన్ని స్థాపిస్తామని మోదీ చేసిన ప్రకటననే ఢిల్లీ ప్రజలు విశ్వసిస్తున్నారు.