కమలం ఖాతాలోనే సాగర్..?

కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి తిరుగులేదు. ఉత్తర, మధ్య భారతాన్ని కమలం పార్టీ దున్నేస్తోంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లోని 29 లోక్ సభా నియోజకవర్గాలను సైతం తన ఖాతాలో వేసుకునే పనిలో ఉంది. మోదీ కరిష్మా, బీజేపీ చేసిన మంచి పనులు ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవాలి. ఈ క్రమంలో సాగర్ నియోజకవర్గంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సాగర్, విదిషా జిల్లాల్లో ఆ నియోజకవర్గం విస్తరించి ఉంది. మొత్తం ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు సాగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.

ఈ సారి కొత్త అభ్యర్థి…

రాజ్ బహదూర్ సింగ్, సాగర్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఈ సారి ఆయనకు విశ్రాంతినిచ్చి లతా వాంఖడేను బరిలోకి దింపారు. కాంగ్రెస్ తరపున గుడ్డురాజా బుందేలా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కంటే బీజేపీకి పది రెట్లు అడ్వాంటేజ్ ఉందని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నమాట. అక్కడి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉండటమే ఇందుకు కారణం. ఒక్క బీనా అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.

బీజేపీ సంస్థాగత బలం..

మధ్యప్రదేశ్లోని 29 నియోజకవర్గాల్లో బీజేపీ నాలుగు చోట్ల మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. అందులో సాగర్ నుంచి పోటీ చేసే లతా వాంఘడే కూడా ఒకరు. బలమైన సంస్థాగత నిర్మాణం, క్షేత్రస్థాయిలో క్రియాశీల శాఖలే ఆ పార్టీకి బలమని చెప్పక తప్పదు. మోదీ చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని బీజేపీ ప్రచారం చేస్తోంది. గత పదేళ్లుగా చేసిన పనులను చూసి ఓటెయ్యాలని వాళ్లు కోరుతున్నారు. అక్కడ ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఐనా కులం, మతంతో సంబంధం లేకుండా మోదీ నాయకత్వానికి ప్రజలు ఓటేస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. హిందూ ఓట్లలో మెజార్టీ వర్గం బీజేపీకి వెళ్లిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది….

త్వరలో ఐటీ పరిశ్రమలు రాక..

2019లో బీజేపీకి అక్కడ 62 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి బలం చెక్కుచెదరలేదని బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. పైగా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించకుండా కొత్త అభ్యర్థిని నిలబెట్టారు. లతా వాంఘడేని నిలబెట్టడం వల్ల మహిళల ఓట్లు మూకుమ్మడిగా పడే వీలుంది. కాంగ్రెస్ హయాంలో మహిళలపై జరిగిన దాడులు ఇప్పుడు ఆగిపోయాయి. పదేళ్లలో అక్కడ విద్యావకాశాలు బాగా పెరిగాయి. వైద్య సేవల రంగంలో మెరుగుదల కనిపించింది. పారిశ్రామికాభివృద్ధికి కూడా బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. త్వరలో ఐటీ క్లస్టర్స్ రాబోతున్నాయి…