సూరత్ ఏకగ్రీవం ఎలా సాధ్యపడింది..?

లోక్ సభకు బీజేపీ 3.0లో తొలి అడుగు పడింది. గుజరాత్లోని సూరత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముకేష్ కుమార్ చంద్రకాంత్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలం తర్వాత లోక్ సభకు ఒక అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే మొదటి సారి. దీనిపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ.. పార్లమెంటులో తొలి కమలం వికసించిందని చెబుతున్నారు.

వైదొలిగిన 14 మంది అభ్యర్థులు

ముకేష్ కుమార్ సహా మరో 14 మంది అభ్యర్థులు తొలుత బరిలోకి దిగారు. ఎనిమిది మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆరు నామినేషన్లు తిరస్కారానికి గురయ్యాయి. అందులో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఉన్నారు. దానితో సూరత్లో బీజేపీ ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్లు ఉప సంహరించుకున్న వారిలో నలుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు.

సంతకం పెట్టడం చేతకాని వాళ్లు..

కాంగ్రెస్ తరపున ఇద్దరు రంగంలోకి దిగారు. సురేష్ భాయ్ పద్సాలా కాంగ్రెస్ తరపున నామినేషన్ వేయగా, కుంభానీ నిలేష్ భాయ్ కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే వారిద్దరి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. వారిని ప్రతిపాదించిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి ఉన్నాయని రిటర్నింగ్ అధికారి గుర్తించారు. కనీసం సంతకాలు చేయడం చేతగాని వాళ్లు, ఫోర్జరీ చేసే వాళ్లు ఎలా బరిలోకి దిగుతారని సూరత్ జనం నవ్వుకుంటున్నారు. అలాగే సాంకేతిక కారణాలో మరో నాలుగురి నామినేషన్లు తిరస్కారానికి గురయ్యారు. బీజేపీ అభ్యర్థి ముకేష్.. సూరత్ నియోజకవర్గానికి తగిన ప్రతినిధి అని చెబుతూ కొందరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వారంతా ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు…

ఏకగ్రీవంగా ఎన్నికైన 26వ వ్యక్తి

ముకేష్ భాయ్ లోక్ సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన 26వ వ్యక్తిగా రికార్డులకెక్కారు. అంతకముందు 25 మంది అలాంటి ఘనతను సాధించారు. 1951లో టీటీ కృష్ణమాచారి సహా ఐదుగురు అభ్యర్థులు అలా ఎన్నికైన వారే. 1957లో రాజమండ్రి నుంచి సత్యనారాయణ రాజు,రాజంపేట నుంచి టీఎన్ విశ్వనాథ్ రెడ్డి, వికారాబాద్ నుంచి సంగం లక్ష్మీబాయ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.1967లో విజయవాడ నియోజకవర్గం నుంచి కేఎల్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1980లో శ్రీనగర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1989లో శ్రీనగర్ నుంచి మొహ్మద్ షఫీ భట్ కూడా యునానిమస్ గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నికైనది మాత్రం ముకేష్ దలాలేనని చెప్పాలి.