హనుమాన్ చాలీసా గురించి మీకు ఈ విషయాలు తెలుసా!

నిరంతరం రామనామస్మరణలో మునిగి తేలేవాడు తులసీదాసు రామభక్తుడు. ఆయన గానామృతానికి పరవశించిపోయిన ఎంతోమంది తులసీదాస్‌ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకునేవారు. కేవలం హిందువులే కాదు, ఇతర మతాలవారు కూడా తులసీదాస్‌ వద్ద రామనామ దీక్ష తీసుకోవడం, రామ భజన చేయడం ప్రారంభించారు. దీంతో తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడంటూ మహారాజుకి ఫిర్యాదు చేశారు… ఆ సమయంలోనే ఆ ఊర్లో ఓ సంఘటన జరిగింది…

రామనామ మహిమ
ఆ ఊరిలో అన్యోన్యంగా జీవించే ఒక జంట ఉండేది. భర్త హఠాత్తుగా కన్ను మూశాడు…అంతిమయాత్ర తులసీదాస్ ఆశ్రమం ముందునుంచి వెళుతోంది. ఆ సమయంలో ఆమె ఒక్కసారిగా ఆశ్రమంలోకి వెళ్లింది…అదే క్షణం అప్రయత్నంగా తులసీదాస్.. దీర్ఘ సుమంగళీ భవ అని దీవించారు. నా భర్త చనిపోయాడు..అదిగో శవయాత్ర జరుగుతోంది…ఇంకేం సౌభాగ్యం అని కన్నీళ్లు పెట్టుకుంది. తనతో రామభద్రుడే అలా పలికించాడు..ఇందులో సందేహం లేదన్న తులసీదాస్ ఆ శవయాత్ర ఆపించి రామనామం జపించి తన కమండంలో నీళ్లు తీసి చల్లాడు.. వెంటనే జీవం వచ్చింది. ఆ ఘటన తర్వాత రామనామదీక్ష తీసుకునేవారి సంఖ్య అమితంగా పెరిగిపోయింది.

పాదుషాకి ఆంజనేయ సాక్షాత్కారం
మత గురువు పాదుషా తులసీదాస్ ని విచారించేందుకు పిలిపించారు. చనిపోయినవారిని బతికిస్తుందా రామనామం…ఇప్పుడే శవాన్ని తెప్పిస్తాను బతికించు…లేదంటే రామనామానికి మహిమ లేదని చెప్పు అన్నారు. తులసీదాస్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోవడంతో బంధించమని ఆజ్ఞాపించారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో కానీ వేల సంఖ్యలో కోతుల గుంపు సైనికులపై పడ్డాయి. అవన్నీ కోతులు కాదు…రామదండు. ఆశ్చర్యపోయిన పాదుషాకి సింహద్వారంపై కూర్చుని అభయహస్తం చూపుతూ ఆంజనేయుడు కనిపించాడు. అలా ఆంజనేయుడిని చూసిన తులసీదాస్ అప్రయత్నంగా జయహనుమాన జ్ఞానగుణసాగర అంటూ హనుమాన్ ని స్తుతించాడు. అదే హనుమాన్ చాలీశా…

కష్టాల్లో ఉన్నవారికి అండ
తులసీదాసు స్తుతికి హనుమంతుడు ప్రసన్నుడై “నాయనా! నీస్తుతితో నన్ను ప్రసన్నం చేసుకున్నావు. ఈ మూకని సంహరించాలా? తరిమికొట్టాలా? నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అని అన్నాడు స్వామి. ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు స్తుతించినా వారిని అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ మాటలకు స్వామి మరింత ప్రసన్నుడై తథాస్తు అని అనుగ్రహించాడు. అందుకే కష్టాల్లో ఉన్నవారు హనుమాన్ చాలీశా పారాయణం చేస్తే ఉపశమనం లభిస్తుందంటారు..

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..