ఏపీలో మోదీ విస్తృత ప్రచారం – బీజేపీ పోటీ చేసే స్థానాల్లో నాలుగు బహిరంగసభలు

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమి కట్టిన నేపథ్యంలో, ఇప్పటికే ఓసారి ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ… త్వరలో మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఎన్డీయే కూటమి తరఫున ఏపీలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

కీలక చోట్ల మోదీ బహిరంగసభలు

ప్రధాని మోదీ అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేటతో పాటు బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న మరో ప్రాంతంలో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. ఈ సభల్లో ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చే లోపు వీలైనన్ని సభలతో ఉమ్మడి ప్రచారం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు 24న రాయలసీమలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. రాజంపేట, రైల్వే కోడూరులో నిర్వహించే ప్రజాగళం, వారాహి విజయభేరి సభల్లో పాల్గొంటారు.

కూటమి అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ కృషి

కూటమి అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ నేతలు విస్తృతంగా శ్రమిస్తున్నారు. తమకు లభిస్తున్న ప్రాధాన్యతపై వారు అసంతృప్తిగా ఉన్నప్పటికీ పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ఆ దిశగా ప్రచారం చేస్తున్నారు. పోటీ చేస్తున్న ఆరు పార్లమెంట్, పది అసెంబ్లీ సీట్లలో గెలిచేలా వంద శాతం స్ట్రైక్ రేట్ ఉండేలా చూసుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా ప్రధాని ప్రచారం

దేశంలో నాలుగో విడత ఎన్నికల కోసం నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగో విడతలో భాగంగా ఏపీలో మే 13న ఒకే రోజున అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఎన్నికలకు కొన్ని వారాల సమయం మాత్రమే ఉండడంతో ప్రచారం ముమ్మరం చేయాలని కూటమి భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీని రాష్ట్రానికి రప్పిస్తున్నారు. మోదీ సభల షెడ్యూల్ ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు. మోదీ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తూండటంతో… పరిస్థితుల్ని బట్టి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.