తిరుపతి ఎంపీ సీటులో హోరాహోరీ – ఈ సారి ఫలితం బీజేపీకే అనుకూలమా ?

ఒకప్పుడు బీజేపీ జెండా ఎగిరిన తిరుపతి లోక్ సభలో మరోసారి బీజేపీ జెండా ఎగిరే సూచనలు కనిపిస్తున్నాయి. తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, వెంకటగిరి అసెంబ్లీ స్థానాలున్నాయి. పోలింగ్‌ దగ్గర పడటంతో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. సంక్షేమానికే మళ్లీ అధికారం ఇస్తారని వైసిపి శ్రేణులు భావిస్తుండగా, సంక్షేమంలో పక్షపాతం, అభివృద్ధి లేమి, ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి అంశాలు తమకు విజయావకాశాలుగా కలిసి వస్తాయని టిడిపి-జనసేన-బిజెపి కూటమి శ్రేణులు అంచనా వేసుకుంటున్నాయి.

అభ్యర్థి కన్నా బీజేపీ బరిలో ఉండటమే కీలకం

తిరుపతి ఎంపి స్థానానికి సిట్టింగ్‌ వైసిపి ఎంపి మద్దిల గురుమూర్తి బరిలో ఉన్నారు. తాను మూడేళ్ల కాలంలో చేసిన అభివృద్ధే గెలిపిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు వైసిపి ఎంఎల్‌ఎ వరప్రసాద్‌కు టిక్కెట్‌ రాకపోవడంతో బిజెపిలో చేరి ఆ పార్టీ తరపున తిరుపతి ఎంపిగా బరిలో దిగారు. ఇక్కడ అభ్యర్థి కన్నా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాతీయ స్థాయిలో మోదీ హవా.. పుణ్యక్షేత్రం నుంచి బీజేపీ ప్రతినిధికి ఢిల్లీకి పంపడం సెంటిమెంట్ గా కనిపిస్తున్నాయి.

అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల హవా

తిరుపతిలో డిప్యూటీ మేయర్‌ భూమన అభినరురెడ్డి వైసిపి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. . చిత్తూరు వైసిపి ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులుకు ఆ పార్టీలో టిక్కెట్‌ రాకపోవడంతో జనసేన తరపున పోటీ చేస్తున్నారు. తొలుత కూటమిలో లుకలుకలు బహిరంగంగా కనిపించినా..ఆ తరువాత మూడు పార్టీల నేతలూ ప్రస్తుతం ప్రచారంలో భాగస్వాములవుతున్నారు. చంద్రగిరిలో వైసిపి నుంచి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పోటీచేస్తున్నారు. టిడిపి అభ్యర్థి పులివర్తి నాని కూటమిదే గెలుపన్న ధీమాతో ఉన్నారు. జనసేన, బీజేపీ మద్దతు ఆయనకు కలసి వస్తోంది. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌రెడ్డి టిడిపి నుంచి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి వైసిపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బియ్యపు అనుచరులు చేసిన భూకబ్జాలు, అక్రమాలే తమను గెలిపిస్తాయని సుధీర్‌రెడ్డి చెపుతున్నారు. శ్రీకాళహస్తిలో తాను చేసిన అభివృద్ధే తనను మరోసారి గెలిపిస్తుందని నమ్మకంతో బియ్యపు ఉన్నారు.

కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీల్లో అసమ్మతి

సత్యవేడులో ఎంఎల్‌ఎ ఆదిమూలంకు వైసిపి టిక్కెట్‌ రాకపోవడంతో సైకిల్‌ ఎక్కారు. మంత్రి పెద్దిరెడ్డి తనపై కక్షగట్టి వైసిపిలో టిక్కెట్‌ రాకుండా చేశారని ప్రచారం చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైసిపి తరపున పోటీలో ఉన్న నూకతోటి రాజేష్‌ ‘నాన్‌లోకల్‌’ అనే చర్చ ఉంది. టిడిపి టిక్కెట్లు రాకపోవడంతో జెడి రాజశేఖర్‌, రమేష్‌లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉండడంతో టిడిపి ఓట్లు చీలే అవకాశం ఉంది. సూళ్లూరుపేటలో నెలవల విజయశ్రీ టిడిపి నుంచి, సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ కిలివేటి సంజీవయ్య వైసిపి నుంచి విస్తృత ప్రచారం గావిస్తున్నారు. సంజీవయ్య కబ్జాలు, అవినీతి అక్రమాలే తమను గెలిపిస్తాయని టిడిపి ధీమా. వెంకటగిరిలో నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, టిడిపి తరపున మాజీ ఎంఎల్‌ఎ కురుగొండ్ల రామకృష్ణ హోరాహోరీగా తలపడుతున్నారు గూడూరులో టిడిపి నుంచి పాశం సునీల్‌కుమార్‌, వైసిపి నుంచి మేరిగ మురళీ మధ్య పోటాపోటీ ప్రచారం జరుగుతోంది. వైసిపి నుండి తమ పార్టీలో చేరికలతో తమ గెలుపు సునాయాశమని సునీల్‌కుమార్‌ చెబుతున్నారు.

మొత్తంగా అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఉంది. .