బీజేపీది చంద్రయాన్, సోనియాది రాహుల్ యాన్ ….

ఎన్నికల వేళ అనేక అంశాలు తెరమీదకు వస్తుంటాయి. అందులో కొన్ని హాస్యంతో కూడిన విమర్శలు కూడా ఉంటాయి. జాతీయ ప్రధానాంశాల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ, లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తోంది. శక్తిమంతమైన బీజేపీని ఢీకొట్టే ప్రక్రియలో తడబడుతోంది. ఏదో మాట్లాడబోయి ఏదో చేస్తున్న కాంగ్రెస్ నేతలను బీజేపీ పెద్దలు ఉతికి ఆరేస్తున్నారు. దానితో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది.

ఓ ఆటాడుకున్న అమిత్ షా…

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన కర్ణాటక పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. దీనికోసం చంద్రయాన్ ను ఉదాహరణగా తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం చంద్రయాన్ ను సక్సెస్ చేసిందని గుర్తుచేశారు. సోనియాగాంధీ మాత్రం ఒక యాన్ ను 20 సార్లు లాంఛ్ చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన అన్నారు.రాహుల్ గాంధీ ఇప్పుడు రాయ్ బరేలీలో పోటీ చేస్తున్న అంశాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్ని అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీని పాతాళానికి నెట్టేశారని ఆయన గుర్తుచేశారు. 20 లాంఛింగులు అయిపోయి ఆయన 21వ సారి అమేఠీ నుంచి లాంచ్ అవుతున్నారని అమిత్ షా ఎగతాళి చేశారు.

రాయ్ బరేలీలోనూ ఓటమి ఖాయం…

రాహుల్ గాంధీ వృథా ప్రయాసకు దిగుతున్నారని అమిత్ షా అన్నారు. రాయ్ బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ ఆయన్ను భారీ మెజార్టీతో ఓడిస్తారన్నారు. నా మాటలను రాసి పెట్టుకో రాహుల్ అంటూ ఆయన సవాలు విసిరారు. సోనియా కుటుంబానికి పెత్తనం చేయడం తప్ప ప్రజల్లో ఉండటం అలవాటు లేదని ఆయన ఆరోపణలు సంధించారు.అమేఠీలో ఘోర పరాజయం పాలవుతామన్న భయంతో రాయ్ బరేలీ పారిపోయినా రాహుల్ కు పెద్దగా ఉపయోగం ఉండదని, ఈ సారి కేరళలోని వయనాడ్ నుంచి కూడా ఓటమి ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు…

పారిపో రాహుల్ అంటున్న మోదీ…

వయనాడ్ నుంచి ఓడిపోతుండటం వల్లే రాహుల్ గాంధీ.. యూపీలోని రాయ్‌బరేలీకి తరలిపోయారని ప్రధాని మోదీ అన్నారు. ‘పారిపో రాహుల్‌ పారిపో…భయపడొద్దు’ అంటూ ఎద్దేవాచేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆమేఠీలో 2019లో ఓటమి తర్వాత ‘యువరాజు’ వయనాడ్‌కు మారారని, ఈ ఎన్నికల్లో అక్కడ ఓడిపోతారని ఆయనకు తెలుసన్నారు. అలాగని ఆమేఠీలో పోటీచేసి గెలిచే ధైర్యం లేదని. అందువల్ల ఆయన రాయ్‌బరేలీకి తరలిపోయారని విశ్లేషించారు. కాంగ్రెస్‌ నాయకుల్లోని ఓటమి భయానికిదే నిదర్శనమని మోదీ విరుచుకుపడ్డారు.