ఎన్ఐఏపై ఆరోపణల చేసి భంగపడిన తృణమూల్…

తృణమూల్ కాంగ్రెస్ పొద్దున లేస్తే చేసేదీ రౌడీయిజం, కార్చేది మాత్రం ముసలి కన్నీరు. ప్రతీ రోజు బీజేపీపై పడి ఏడ్వడం మినహా పార్టీ అధినేత్రి అయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్దగా ఒరిగించిందేమీ లేదు. పైగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఎన్ఐఏ అధికారుల మీదే దాడులు చేయించడం దీదీకే చెల్లిందని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు అదే విషయంపై బీజేపీ నేతలు దీదీ పార్టీని ఉతికి ఆరేస్తున్నారు.

భూపతినగర్ పేలుడు కేసు…

భూపతినగర్ పేలుడు కేసులో ఇటీవల విచారణకు వెళ్లిన ఐన్ఐఏ అధికారులపై తృణమూల్ గూండాలు దాడులు చేశారు. సందేశ్ ఖళీ తరహాలో వాళ్లు విరుచుకుపడ్డరు. ఉదయమే భూపతి నగర్ ప్రాంతానికి వెళ్లిన అధికారుల వాహనాలను అడ్డుకోవడంతో పాటు వాటిని ధ్వంసం చేశారు. కొందరు అధికారులను కర్రలతో కొట్టి గాయపరిచారు. అందులో ఒక అధికారి క్షతగాత్రుడై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పైగా తామంతా తృణమూల్ కార్యకర్తలమని వాళ్లు బహిరంగంగానే చెప్పుకున్నారు.

ఒక్కరినీ అరెస్టు చేయని పోలీసులు

2022 నాటి భూపతినగర్ బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మనోబ్రోతో జనా, బైలీచరణ్ మైటీ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. అప్పట్లో ఒక తృణమూల్ నేత ఇంట్లో దాచిన బాంబులు పేలడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఆ కేసు విచారణలో స్థానిక పోలీసులు ఆసక్తి చూపకపోవడంతో ఎన్ఐఏ రంగంలోకి దిగాల్సి వచ్చింది. బాంబులు నిల్వ ఉంచడం వెనుక ఏదైనా విద్రోహ చర్య దాగొన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై విచారణకు వచ్చిన అధికారులను స్థానిక తృణమూల్ కార్యకర్తలు కొట్టడమే కాకుండా…ఉల్టా చోర్ కత్వాల్ కో డాంటే అన్నట్లుగా వారిపైనే కేసులు పెట్టారు. ఎన్ఐఏ అధికారులు మహిళల పట్ల అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తించినట్లు కేసు పెట్టారు.

తృణమూల్ ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్ఐఏ

ఎన్ఐఏ అధికారులు అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. కావాలంటే విచారణకు సంబంధించిన వీడియాలు ఉన్నాయని, తృణమూల్ నాయకులు ఎవరైనా వచ్చి వాటిని పరిశీలించొచ్చని ప్రకటించింది. బీజేపీ నేతలు ఎన్ఐఏతో టచ్ లో ఉన్నారన్న ఆరోపణలను కూడా ఖండించింది.ఎన్ఐఏ సూపరింటెండెంట్ ఇంటికి బీజేపీ నేతలు వెళ్లి.. అరెస్టు చేయాల్సిన తృణమూల్ నేతల జాబితాను సమర్ఫించారంటూ అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలను సైతం తోసిపుచ్చింది. జితేంద్ర తివారీ అనే బీజేపీ నేతను తాము ఎన్నడూ కలవలేదని ఎన్ఐఏ అధికారిక స్టేట్ మెంట్ పడేసింది. ముందస్తు సమాచారం ఇచ్చి విచారణకు రావడం కుదరదని తేల్చిచెప్పింది. మరో పక్క మమతా బెనర్జీ తీరుపై బీజేపీ నేత సువేందు అధికారి మండిపడ్డారు. ఆమె బుద్దిపూర్వకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలపై తృణమూల్ గూండాలను ఉసిగొల్పుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి దుశ్చర్యలు ఎక్కువ కాలం సాగవని హెచ్చరించారు.