గుంతకల్లు టీడీపీలో ఐక్యతా రాగం – గుమ్మనూరు జయరాంకు లైన్ క్లియర్

గుంతకల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో కీలక మలుపు చోటుచేసుకుంది. నియోజక వర్గం టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ను ప్రస్తుత టిడిపి అభ్యర్థి గమ్మనూరు జయరాం కలిశారు. జితేంద్రగౌడ్‌కు టిడిపి అధిష్టానం టికెట్‌ నిరాకరించడంతో ఆయన అభిమానులు ఇటీవల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టిడిపి అధిష్టానం పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగింది. జితేందర్ గౌడ్ ను బుజ్జగించింది.

జితేందర్ గౌడ్ ను కలిసిన జయరాం

మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ను గుమ్మనూరు జయరాంతో పాటు ఆయన సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి, శ్రీనివాసులు, మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ నారాయణలు కలిశారు. జితేంద్ర గౌడ్‌ సోదరుడు మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ శ్రీనాథ్‌ గౌడ్‌ ఆయన తనయుడు మున్సిపల్‌ కౌన్సిలర్‌ పవన్‌ కుమార్‌ గౌడ్‌, సునీల్‌ గౌడ్‌, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గుంతకల్లులో టిడిపి అభ్యర్థి గుమ్మనూరు జయరాం గెలుపునకు సహకరించాలని మద్దతు కోరారు. చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకునే లక్ష్యంతో ముందుకు సాగుదామని కోరారు.

టీడీపీలో ఎంతో కష్టపడ్డామన్న జితేందర్ గౌడ్

న జితేంద్ర గౌడ్‌ మాట్లాడుతూ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా ఉన్న తనకే టికెట్టు ఇస్తారని తన కార్యకర్తలు ఆశించారని తెలిపారు. తనకు టికెట్టు ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు, కార్యకర్తలు కొంత అసహనాన్ని వ్యక్తం చేశారన్నారు. దశాబ్దాల కాలంగా టిడిపి కోసం తాము ఎంతో కష్టపడ్డామని తెలియజేశారు. టికెట్టు ఇవ్వకపోవడానికి గల కారణాలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమతో చర్చించారన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధినేత ఆదేశానుసారం గుంతకల్లు నియోజక వర్గంలో టిడిపి జెండా ఎగురవేయడానికి తమవంతు పూర్తి సహకారం అందిస్తామని గుమ్మనూరు జయరాంకు జితేంద్రగౌడ్‌ హామీ ఇచ్చారు.

అంతా ఏకమైతే కూటమి అభ్యర్థికి పాజిటివ్ !

దీంతో టిడిపిలో గత వారం రోజులుగా నెలకొన్న అసమ్మతి రాగానికి తెరపడింది. అనంతరం గుంతకల్లు, గుత్తి, పామిడి పట్టణ మండలాల సీనియర్‌ నాయకులు, కార్యకర్తలను గుమ్మనూరు సోదరులకు జితేంద్ర గౌడ్‌ పరిచయం చేశారు. అందరినీ కలుపుకుని గెలుపే లక్ష్యంగా పని చేస్తానని అభ్యర్థి గుమ్మనూరు జయరాం తెలిపారు.