నెల్లిమర్లలో వైసీపీకి చిక్కులు – వలస పోతున్న క్యాడర్

ఉత్తరాంధ్ర లో జనసేన దక్కించుకున్న సీట్లలో ఒకటి అయిన నెల్లిమర్లలో వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని అనుకున్నారు. కానీ పరిస్థితి రాను రాను మారిపోతోంది. వైసీపీ నుంచి క్యాడర్ వలస పోతున్నారు. నెల్లిమర్ల పార్టీ బీటలు వారుతోంది. ముఖ్యంగా మండలాలతో బాటు, నగర పంచాయతీలో అధికార వైసిపికి చెందిన ఒక్కొక్కరుగా ఇతర పార్టీలోకి చేరుతున్నారు.

వైసీపీకీ బలమైన మండలాల నుంచి వలసలు

వైసిపికి పట్టు కొమ్మలుగా ఉన్న టెక్కలి, కొండ వెలగాడ, పూతిక పేట, ఒమ్మి గ్రామాల నుంచి వైసిపిని వీడి నాయకులు టిడిపి, జనసేనలో చేరుతున్నారు. నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బంగారు సరోజినీ, 16వ వార్డు కౌన్సిలర్‌ పండ్రాంకి సత్యవతి, నాయకులు సత్యనారాయణ తన అనుచరగణంతో కలిసి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. కాగా మండల స్థాయి, జిల్లా స్థాయి అధికార వైసిపి నాయకులు కూడా పార్టీని వీడుతారని సమాచారం రావడంతో అధిష్టానం ఆగమేఘాల మీద వారిని బుజ్జగించి దిద్దుబాటు చర్యలు చేపడుతోంది.

అప్పల్నాయుడు ఏకపక్ష వైఖరితో ఇబ్బందులు

అభ్యర్థిపై వ్యతిరేకత ఉన్నా.. స్వయంకృతంగా అధికార వైసిపి తీసుకున్న నిర్ణయాలతో కొంత మంది విసిగి వేసారి వేరే పార్టీలో చేరుతున్నట్లు చర్చ జరుగుతోంది. నగర పంచాయతీ పరిధి నెల్లిమర్ల, జరజాపు పేటలో అధికార వైసిపిపై ఆ పార్టీ నేతలే అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల మిమ్స్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో అధికార వైసిపి వ్యవహరించిన తీరు కూడా ఆపార్టీ పట్ల వ్యతిరేకత కనిపిస్తుంది. మండలంలోని పూతికపేట మాజీ సర్పంచ్‌ గోవింద, జెడ్‌పిటిసి స్వగ్రామం కొండవెలగాడకు చెందిన వైసిపి నాయకులు పెద్ద ఎత్తున జనసేనలో చేరారు.

జనసేన , టీడీపీల్లో చేరిక

టెక్కలి మాజీ సర్పంచ్‌ వైసిపిని వీడి టిడిపిలో చేరారు. ఇలా పలు గ్రామాలకు చెందిన వైసిపి మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు టిడిపి, జనసేనలో చేరడంతో వైసిపి పట్టు సడలుతోంది. వైసిపి మండల స్థాయి నాయకత్వంలో కూడా అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో వారిలో చాలా మంది పార్టీ మారిపోతారనే వాదన వినిపిస్తోంది. వారిని ఆపకపోతే.. ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.