శ్రీరామ నవమి స్పెషల్ – అయోధ్యకు 1,11,111 కిలోల లడ్డూలు!

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత తొలిసారి జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 17న జరగనున్న ఉత్సవాల్లో రాములోరి ప్రసాదంగా భక్తులకు పంచేందుకు భారీ సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా 1,11,111 కిలోల లడ్డూలను రామాలయానికి పంపనున్నట్లు యూపీలోని మీర్జాపుర్‌లో దేవ్‌రహ హాన్స్ బాబా ట్రస్టు వెల్లడించింది.

శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య సిద్ధమవుతోంది..అయోధ్య నగర వ్యాప్తంగా యూపీ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. శ్రీరామ నవమి రోజు లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తారని అధికారుల అంచనా. అందుకే శ్రీరామ నవమికి వచ్చే భక్తులందరకీ ప్రసాదం అందేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ మేరకు అయోధ్య రాముల వారికి ఏకంగా 1,11,111 కిలోల లడ్డూలను ప్రసాదంగా సమర్పించబోతున్నామని ప్రకటించారు దేవరహ హన్స్ బాబా ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా.

వారానికోసారి కాశీ – తిరుపతి…ఇప్పుడు అయోధ్య
దేవరహ హన్స్ బాబా ట్రస్ట్ వారు ప్రతివారం ఈ లడ్డూ ప్రసాదాలను కాశీ విశ్వనాథ ఆలయానికి, తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆలయానికి పంపిస్తున్నారు. జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠాపన రోజున కూడా 40 వేల కిలోల లడ్డూను నైవేద్యానికి పంపినట్లు తెలిపారు. దాదాపుగా 500 ఏళ్ల తరువాత అయోధ్యలో శ్రీరాముడి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రత్యేక వస్తాలతో పాటు వేల క్వింటాళ్ల పూలతో అలంకరించనున్నారు. అయోధ్య నగర వ్యాప్తంగా 100కి పైగా ఎల్‌ఈడీ స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు
ఏప్రిల్‌ 17న రామ నవమి సందర్భంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరచి ఉండనున్నాయి. నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. రామ నవమికి ​​వచ్చే లక్షలాది భక్తులకు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు 600 మీటర్ల మేర జర్మన్ హ్యాంగర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఎండలకి భక్తుల పాదాలు కాలిపోకుండా కార్పెట్లు సిద్ధం చేస్తున్నారు.