విషయం తక్కువ ప్రమోషన్ ఎక్కువ – ఏంటీ మలయాళం గోల!

ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీ మొత్తం మలయాళ జపం చేస్తోంది. అక్కడి నుంచి ఏ చిన్న సినిమా వచ్చినా దాన్ని నిజంగా చూసి చెబుతున్నారో చూడకుండా చెబుతున్నారో కానీ అద్భుతం, తిరుగులేదంటూ చాలా హడావుడి చేస్తున్నారు. మలయాళం లాంటి చిన్న ఇండస్ట్రీలో 100 కోట్లు వసూళ్లు రావడం మెచ్చుకోదగిన విషయమే. నిన్న మొన్నటి వరకు పాన్ ఇండియా సబ్జెక్ట్స్ అంటే ఏంటో కూడా తెలియదు…ఇప్పుడు దేశ వ్యాప్తంగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఎవరు ఎదిగినా మంచిదే…వారిని ఎంకరేజ్ చేయడం హుందాతనమే…కానీ ఓ మోస్తరుగా ఉన్న సినిమాలకు కూడా అంత హైప్ ఎందుకిస్తున్నారో తెలుగు ప్రేక్షకులకు అర్థంకావడం లేదు. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ప్రేమలు మూవీ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది….

ప్రస్తుతం మలయాళంలో బ్లాక్ బస్టర్ అనిపించుకుంటున్న సినిమాలన్నీ కూడా గతంలో మన తెలుగులో చేసిన ప్రయోగాలే. సాధారణంగా మనోళ్లకి మనోళ్లే శత్రువులన్నట్టు ఆ సినిమాలను ప్రమోట్ చేస్తున్నంత శ్రద్ధ మన తెలుగు సినిమాలపై లేదు. ప్రేమలు సినిమా కేరళలో విడుదలై 100 కోట్లు వసూలు చేసింది. లాజిక్ చాలా చిన్నది, పెద్దగా సబ్జెక్ట్ కూడా లేదు, అస్సలు కొత్త కథ కానేకాదు..ఒక ఐటీ ప్రొఫెషనల్‌తో ప్రేమలో పడే నిరుద్యోగ యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. మల్లూవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయిందంతే.

ఈ మధ్యే మలయాళం మూవీస్ ని తెలుగులో రిలీజ్ చేసేందుకు, OTT రైట్స్ కొనుక్కుంటున్న వారు..ఆ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు చేయాల్సినదానికన్నా ఎక్కువ హడావుడి చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. వాస్తవానికి ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ప్రేమలు మూవీకి మలయాళంలో వచ్చినంత టాక్ రాలేదు. స్టోరీ మాట దేవుడెరుగు కనీసం కామెడీ కూడా లేదు…. ఈ మధ్య గుంటూరుకారం సినిమాలో కాంట్రవర్శీ క్రియేట్ చేసిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే బూతుపదాలకు మరికొన్ని బూతులు యాడ్ చేశారంతే…కనీసం చెప్పుకోదగిన ఓ డైలాగ్ కూడా లేదు, గుర్తుంచుకునేందుకు ఒక్క సన్నివేశం లేదు…

అప్పట్లో సాయిపల్లవి ‘ప్రేమమ్’ లాంటి మూవీస్ నిజంగా అద్భుతమే..వాటిని పొగిడారంటే అర్థం ఉంది…కానీ ఈ మధ్య కాలంలో మలయాళంలో దుమ్ములేపేస్తున్నాయ్ అని చెప్పుకుంటున్న ఏ సినిమాలోనూ…. హైప్ వచ్చినంత సీన్ కనిపించడం లేదు. ఆ సినిమాలు జస్ట్ బావున్నాయ్ అంతే…బోర్ కొట్టకుండా సాగిపోతున్నాయ్..కానీ మరో బాహుబలి రేంజ్ అనే స్థాయిలో జరుగుతున్న ప్రమోషన్లో అర్థం లేదన్నది చాలామంది ప్రేక్షకుల అభిప్రాయం. పైగా ప్రేమలు మూవీని గామికి పోటీగా దించారు…అసలు ఈ రెండు సినిమాల జోనర్లకు ఏమైనా సంబంధం ఉందా? రెండింటినీ పోల్చి చూడగలమా? ఓవరాల్ గా చూస్తుంటే మలయాళ ప్రేక్షకుల టేస్ట్ మారిందా…తెలుగు ప్రేక్షకుల టేస్ట్ పడిపోయిందా అన్నది క్లారిటీ రావడం లేదనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం..