రెబల్‌గా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భార్య – టెక్కలిలో దువ్వాడ ఫ్యామిలీ రాజకీయం !

నామినేషన్లు వేసేటప్పుడు భర్తల తరపున భార్యలు.. భార్యల తరపున భర్తలు డమ్మీ నామినేషన్లు వేయడం చూస్తూంటాం కానీ.. రెబల్ గా పోటీ చేయడం చూడం. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని మరోసారి నిరూపితమైంది. భర్తపై భార్య రెబల్ గా పటీకి దిగుతున్నారు.

టెక్కలి రెబల్‌గా దువ్వాడ వాణి

టెక్కలి ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్‌ సతీమణి వాణి ఎమ్మెల్యే అభ్యర్థిగా టెక్కలి నుంచి పోటీ చేయనున్నట్లు గురువారం అనూహ్యంగా ప్రకటించడంతో వైసిపి కేడర్‌లో కలకలం రేగింది. ఈనెల 22న ఆమె నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబంలో కొంత కాలంగా నెలకొన్న వివాదం ఆయన్ను వెంటాడుతూనే ఉంది. పార్టీ అధిష్టానం, సిఎంఒ అధికారులు జోక్యం చేసుకుని ఇరువరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్‌ స్థానంలో వాణిని గతేడాది మేలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసిపి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నియోజకవర్గ సమన్వయకర్తలను మార్పు చేసింది.

దువ్వాడ వాణికి రాజకీయ నేపధ్యం

అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు వైసిపి గత నెల 16వ తేదీన విడుదల చేసిన జాబితాలో టెక్కలి అభ్యర్థిగా దువ్వాడనే ఖరారు చేసింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ గెలుపునకు సహకరించాలని, ప్రచారంలో పాల్గొనాలని పార్టీ పెద్దలు సూచించినా, ఆమె ససేమిరా అన్నట్లు తెలిసింది. ఇప్పటివరకు తననెవరూ పట్టించుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆమె, టెక్కలి అభ్యర్థిగా బరిలో నిలవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది . దువ్వాడ వాణి టెక్కలి బరిలో ఉంటే దువ్వాడ గెలుపు కష్టంగా మారుతుందన్న చర్చ నడుస్తోంది. దువ్వాడ వాణి ప్రస్తుతం టెక్కలి జెడ్‌పిటిసి సభ్యులుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె టెక్కలి నుంచి భారీ మెజార్టీతో జెడ్‌పిటిసిగా గెలుపొందారు. ఆమె కాంగ్రెస్‌ హయాంలోనూ టెక్కలి జెడ్‌పిటిసి సభ్యులుగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్‌ పోటీ చేసిన ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషించారు. వాణి తండ్రి సంపతిరావు రాఘవరావు కూడా 1985, 1994, 1996 ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజకీయ పరిచయాలు, కొంత కేడర్‌ ఉన్న నేపథ్యంలో ఓట్లు చీలి టిడిపికి లబ్ధి చేకూరవచ్చన్న చర్చ సాగుతోంది.

ఆస్తుల పంపకంలో గొడవలేనా ?

భార్యభర్తల మధ్య తేడాలు రావడంతో ఆస్తులు పంచుకున్నారు. వైసిపి పెద్దల సమక్షంలో జరిగిన ఆస్తుల పంపకం ఇంకా తేల్లేదని తెలిసింది. టెక్కలిలోని ఇల్లు, సొంటినూరు కొండ, గ్రానైట్‌ కొండ ఆమె పేరున రాస్తానని శ్రీనివాస్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. వాటిపై అప్పు ఉండడంతో, దాన్ని చెల్లించి తన పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలని శ్రీనివాస్‌ను కోరినట్లు తెలిసింది. ఎన్నికల్లో గెలవకపోతే తన పరిస్థితేమిటని, ముందుగానే దీని సంగతి తేల్చుకోవాలని ఆమె అనుకుంటున్నట్లుగా కార్యకర్తల్లో ప్రచారం సాగుతోంది