నర్సాపురం లోక్‌సభలో కూటమి అభ్యర్థుల జోరు – క్లీన్ స్వీప్ ఖాయమేనా ?

పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు, నరసాపురం ఎంపి స్థానం ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసిపి ఐదు చోట్ల, టిడిపి రెండు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోగా, ఎంపి స్థానం వైసిపి దక్కించుకుంది. ఈసారి ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఎన్నికల బరిలో దిగగా, వైసిపి ఒంటరిగా ముందుకు సాగుతోంది. ఇరుపార్టీలు అభ్యర్థుల ఎంపికను పూర్తిచేయడంతో, ఎన్నికల బరిలో నువ్వానేనా అన్నట్లు అంతా తలపడుతున్నారు. ఒక ఉండి నియోజకవర్గంలో మాత్రం ప్రతిపక్ష టిడిపి అభ్యర్థిపై అధిష్టానం పిల్లిమొగ్గలు వేస్తుండటంతో అక్కడ రాజకీయం గరంగరంగా మారింది.

నర్సాపురం అసెంబ్లీలో జనసేన పోటీ

నరసాపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసిపి గెలిచింది. ఇక్కడ టిడిపి, బిజెపి, జనసేన పొత్తులో భాగంగా ఈసారి జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్‌ పోటీ చేస్తున్నారు. వైసిపి అభ్యర్థిగా సిట్టింగు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజు మరోసారి పోటీ చేస్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపి నుంచి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ మరోసారి ఆయనే పోటీ చేస్తున్నారు. వైసిపి నుంచి గుడాల గోపీ పోటీ చేస్తున్నారు. ఆచంట నియోజకవర్గం నుంచి వైసిపి తరఫున సిట్టింగు ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. తణుకు నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. జనసేన టికెట్‌ ఆశించిన విడివాడ రామచంద్రరావు సహకరించని పరిస్థితి నెలకొంది. వైసిపి అభ్యర్థిగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో వైసిపి తరఫున సిట్టింగు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు. . తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వైసిపి తరఫున మంత్రి కొట్టు సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. జనసేన అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు.

మంతెన రామరాజుకు పార్టీ నుంచి వ్యతిరేకత

ఉండి నియోజవర్గం నుంచి టిడిపి సిట్టింగు ఎమ్మెల్యే మంతెన రామరాజు మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయనపై పార్టీ నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందిన వేటుకూరి వెంకట శివరామరాజుకు టికెట్‌ రాకపోవడంతో రెబల్‌గా పోటీలోకి దిగడం కొంత సమస్యగా మారింది. అదే తరుణంలో ఇక్కడ మంతెన రామరాజును మార్చి ఇటీవలే టిడిపిలో చేరిన రఘురామ కృష్ణరాజుకు టికెట్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి వ్యతిరేకంగా రామరాజు అనుచరులు పెద్దయెత్తున ఆందోళన నిర్వహించారు. ఈ అంశాలన్నీ టిడిపికి మైనస్‌గా మారాయి. వైసిపి నుంచి పివిఎల్‌ నరసింహరాజు పోటీ చేస్తున్నారు. పార్టీ బలంపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.

ఎంపీ స్థానంలో బీజేపీకి వార్ వన్ సైడ్

నరసాపురం ఎంపి బరిలో బిజెపి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ పోటీ చేస్తున్నారు. వైసిపి ఎంపి అభ్యర్థిగా గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. రాజకీయంగా బలమైన అభ్యర్థి కాదు. అియ.తే పొత్తుల్లో భాగంగా బీజేపీ ఎప్పుడుపోటీ చేసినా విజయం ఖాయంగా వస్తోంది. ఈ సారి కూడా నర్సాపురం నుంచి బీజేపీ ఎంపీ ఢిల్లీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.