దెందులూరు నుంచి బీజేపీ పోటీ ? ఆనపర్తికి బదులుగా మార్పు ?

ఏపీలో కూటమి సీట్లలో మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్లు ప్రారంభం అయినందున రేపోమాపో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆనపర్తి సీటును తిరిగి తీసుకోవాలనుకుంటున్న టీడీపీ.. అందుకు బదులుగా దెందులూరు నియోజకవర్గం ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు అక్కడ టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

ఆనపర్తి కోసం పట్టుబడుతున్న టీడీపీ

ఆనపర్తి నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించారు. అక్కడ మాజీ సైనికుడికి బీజేపీ టిక్కెట్ కేటాయించింది. అయితే టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మాత్రం తనకే సీటు కావాలని పట్టుబడుతున్నారు. ఆయన రెబల్ గా పోటీ చేసేందుకు సైతం ఏర్పాట్లు చేసుకోవడంతో బుజ్జగింపుల్లో భాగంగా సీటు ఇస్తే.. వేరే చోట సీటు ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ మేరకు అనేక చర్చల తర్వాత దెందులూరు సీటు కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది.

దెందులూరులో చింతమనేని సహకరిస్తారా ?

దెందులూరులో పోటీకి చింతమనేని .. బీజేపీకి సహకరిస్తారా అన్నది కీలకంగా మారింది. ఇప్పటికే ఆయన పేరును ఖరారు చేశారు. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీకి ఇస్తే ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన రెబల్ గా పోటీ చేస్తే బీజేపీకి సీటు కేటాయించి కూడా ప్రయోజనం ఉండదు. అందుకే ఈ విషయంలో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

నామినేషన్లకు మరో ఐదు రోజులు

నామినేషన్లు ప్రారంభమై రెండు రోజులు అయ్యాయి. మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇందులో ఒక రోజు హాలీడే. ఈ లోపే అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. లేకపోతే గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది. వైసీపీ ప్రకటించిన సీట్లలో ఎలాంటి మార్పు చేర్పులు చేయాలనుకోవడం లేదు.