ఆప్ అవినీతిని బయటపెట్టిన మరో అరెస్టు

ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీలో మరో అవినీతి తిమింగలం జైలుకెళ్లింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ స్కాంకు సంబంధించి ఆప్ నేత అమానతుల్లా ఖాన్ ను ఈడీ అరెస్టు చేసింది. ఈడీ కార్యాలయంలో తొమ్మిది గంటల విచారణ తర్వాత అమానతుల్లా ఖాన్ అరెస్టును ఈడీ ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాంటి వారి తర్వాత ఇప్పుడు ఖాన్ అరెస్టయ్యారు…

ఉద్యోగుల నియామకంలో అవినీతి….

అవినీతి నిరోధక ఉద్యమంలో పుట్టిన ఆప్.. ఇప్పుడు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా ఉన్న అమానతుల్లా ఖాన్.. అక్కడ ఉద్యోగుల నియామకానికి సంబంధించి అవినీతికి పాల్పడ్డారని ఈడీ ఛార్జ్ షీటు కూడా వేసింది. అరెస్టును తప్పించుకునేందుకు ఆయన సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. అత్యున్నత న్యాయస్థానంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాతో కూడిన ధర్మానం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో గురువారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. గత్యంతరం లేని పరిస్తితుల్లోనే ఖాన్ … ఈడీ ఆఫీసుకు వచ్చారు.

బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు

రిక్రూట్మెంట్ స్కాం చేసిన అమానతుల్లా ఖాన్ .. చాలా తెలివిగా వ్యవహరించారు. ఉద్యోగాలిచ్చి తీసుకున్న లంచం సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేశారు. తన పేరుతో కాకుండా తన అనుచరుల పేర్లతో స్థిరాస్తులు కొన్నట్లు ఈడీ గుర్తించింది . ఎంత డబ్బులు ఎవరికి చెల్లించారో లెక్కలు తీసిన తర్వాతే ఈడీ అరెస్టుల పర్వానికి తెర తీసింది. డిజిటల్ లావాదేవీల వివరాలు సేకరించిన తర్వాతే ఖాన్.. మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. రిక్రూట్మెంట్ స్కాంలో ఖాన్ కంటే ముందు ముగ్గురు అనుచరులను అరెస్టు చేశారు. జీషన్ హైదర్, దావుడ్ నాసిర్, జావెద్ ఇమామ్ సిద్ధిఖీలను అరెస్టు చేసి విచారించగా, కీలక వివరాలు అందాయి. వాటిని వేర్వేరు స్థాయిల్లో బేరీజు వేసిన తర్వాతే ఖాన్ పై చర్యలకు ఉపక్రమించారు. తాను నిర్దోషినని ఖాన్ ఎన్ని రకాలుగా మొసలి కన్నీరు కార్చినా ప్రయోజనం లేకపోయింది.

బెయిల్ కోసం కేజ్రీవాల్ నాటకాలు

మద్యం స్కాంలో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఈడీ కొత్త అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఆయనకు ఇంటి భోజనం తెప్పించుకునే అనుమతి లభించగా… కేజ్రీవాల్ .. మామిడి పండ్లు, స్వీట్స్ తింటున్నారని ఈడీ తేల్చింది. ఇప్పుటికే డయాబెటీస్ తో బాధపడుతున్న కేజ్రీవాల్ కు మామిడి పండ్లు తింటే షుగర్ పెరుగుతుందని తెలియనిది కాదు. కాకపోతే అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్ పొందే ప్రయత్నంలో ఉన్నారని ఈడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు..