మోదీ చేసిన అభివృద్ధే గెలిపిస్తుందంటున్న అమిత్ షా

పదేళ్ల పాలన ఒక గీటు రాయి. ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిచిన ఆర్థికాభివృద్ది మచ్చుతునక. ఎక్కడికెళ్లినా ప్రధాని మోదీ అందుకుంటున్న నీరాజనాలు ఒక ఉదాహరణ. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా బీజేపీ చేసిన పనులు ఆ పార్టీకి శ్రీరామరక్ష. ముచ్చటగా మూడో సారి ఎన్డీయే అధికారానికి రాబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు..

కీలక చట్టాలతో జనంలో మంచి పేరు…

అమిత్ షా ఇప్పుడు తన నియోజకవర్గం గాంధీనగర్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా ఆయన పబ్లిక్ మీటింగులు, మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరసత్వ చట్టం అమలు, ముమ్మారు తలాఖ్ రద్దు లాంటి అంశాలు తమ పార్టీ పట్ల జనంలో విశ్వాసాన్ని మరింతగా పెంచాయని అమిత్ షా చెప్పుకున్నారు. బీజేపీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టినందునే ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహం కారణంగా దేశం దశాబ్దాలపాటు వెనుకబడిపోయిందని, మోదీ హయాంలో అభివృద్ధి
పనులు మళ్లీ పట్టాలెక్కాయని షా చెప్పుకున్నారు. మోదీ ముందు విపక్షం వెలవెలబోయిందని, వారి వల్ల ఏమీ కాదని కూడా షా ప్రకటించారు…

గాంధీనగర్లో భారీ రోడ్ షో..

దేశవ్యాప్తంగా ఎన్డీయేకు 400 లోక్ సభా స్థానాలు రావడం ఖాయమని అమిత్ షా తేల్చారు. ఏడు దశల ఎన్నికల్లోనూ తమ పార్టీ పైచేయిగా నిలుస్తుందన్నారు. షా పోటీ చేస్తున్న గాంధీ నగర్ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంది. నాటి భారత ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ నుంచి నేటి అమిత్ షా వరకు అందరూ అక్కడ ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం అమిత్ షా నిర్వహించే రోడ్ షోలకు బీజేపీ కార్యకర్తలే కాకుండా భారీగా జనం కూడా హాజరవుతున్నారు. ఈ సారి కనీసం పది లక్షల ఓట్లు సాధించాలని అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఐదు లక్షల మెజార్టీ సాధించారు..

ఈవీఎం మేనిపులేషన్ ఒట్టిమాటే…

ఈవీఎంలను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. అదే నిజమైతే తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలు ఎలా గెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. గుజరాత్లోని 26 స్థానాల్లో ఈసారి కూడా విజయభేరీ మోగిస్తామని షా చెప్పుకున్నారు. పైగా గత ఎన్నికల కంటే అన్ని చోట్ల మెజార్టీ పెరుగుతుందన్నారు. గుజరాత్లో ఒకే దశలో మే 7న పోలింగ్ జరుగుతుంది..