బెంగళూరులో కాంగ్రెస్ కు ఎదురుగాలి…

తెలుగువారు ఎక్కువగా ఉండే నగరాల్లో బెంగళూరు చేరిపోయి చాలా రోజులైంది. రెండు తెలుగు రాష్ట్రాల వెలుపల చెన్నై తర్వాత ఎక్కువ మంది తెలుగువారు తిరిగే నగరం బెంగళూరు అని చెప్పుకోవాల్సి వస్తోంది. సిలికాన్ సిటీ సగం జనాభా తెలుగువారితో నిండిపోయిందని ఒక అంచనా. ఎంత చిన్న వీధిలో చూసినా తెలుగు మాటలు వినిపిస్తూనే ఉంటాయి.ఇదో కోణమైతే ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు రాబట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ రెడ్డి సామాజికవర్గం అభ్యర్థిని నిలబెట్టడం మరో కోణమని చెప్పాలి…

రోడ్ షోలతో సిద్దరామయ్య బిజీ…

కాంగ్రెస్ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరాయమ్య ఇప్పుడు బెంగళూరులో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. జనానికి మరింత చేరువై ఓట్లు అడిగే ప్రయత్నంలో ఉన్నారు. బెంగళూరు సౌత్ అభ్యర్థి సౌమ్య రెడ్డి, బెంగళూరు సెంట్రల్ అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్ గెలుపు కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే ఐటీ సిటీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలు బాగోలేదని గత అనుభవాలు, ప్రస్తుతం జననాడిని బట్టి తెలుస్తోంది….

నోరు అదుపులో పెట్టుకోలేని సిద్దూ..

సిద్దూ మొదటి నుంచి కూడా బ్యాడ్ టాక్ కు పెట్టింది పేరని చెప్పక తప్పదు. ఇప్పుడు కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ జనం వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పరిణితి లేని రాజకీయ నాయకుడని అంటూ సిద్దరామయ్య విరుచుకుపడుతున్నారు. బెంగళూరులోని మిగతా రెండు నియోజకవర్గాల అభ్యర్థులు పీసీ మోహన్, శోభ కరంద్లాజే అంత పనికిమాలిన అభ్యర్థులు లేరని కూడా ఆయన ఆరోపించడం బీజేపీ కేడర్ కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.

బెంగళూరులో గెలవని కాంగ్రెస్..

బెంగళూరులో మూడు లోక్ సభా నియోజకవర్గాలున్నాయి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ అక్కడ ఎప్పుడూ గెలవలేదు. 1999లో మాత్రం మాజీ రైల్వే మంత్రి జాఫర్ షరీఫ్ అక్కడ విజయం సాధించారు. కోటిన్నర జానాభా ఉన్న బెంగళూరులో 2009 వరకు రెండు లోక్ సభా స్థానాలుండగా, అప్పుడు జరిగిన పునర్ విభజనలో మూడు స్థానాలయ్యాయి. అప్పటి నుంచి మూడు చోట్ల బీజేపీ మాత్రమే గెలుస్తూ వచ్చింది. బెంగళూరు సౌత్ ను హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ చేయని ప్రయత్నం లేదు. 2014లో ఐటీ దిగ్గజం నందన్ నిలేకనిని రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ప్రయత్నిస్తోందనే చెప్పాలి. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై మాజీ ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డిని పోటీ చేయిస్తోంది. ఆమె తండ్రి రామలింగా రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా ఉన్నారు. కూతురిని గెలిపించుకునేందుకు ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ప్రజలకు మేలు చేసిన తేజస్వీ సూర్యకు మాత్రమే ఓటు వేస్తామని స్థానిక జనం అంటున్నారు. బెంగళూరు సెంట్రల్ లో కుల, మత రాజకీయాల ఆధారంగా గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ పాచికలు పారవని కూడా తెలిసిపోయింది..