తమిళనాడుపై ప్రధాని మోదీ ఫోకస్…

దక్షిణాదిపై దండయాత్రకు బీజేపీ బయలుదేరి చాలా రోజులైంది. కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇప్పుడు తమిళనాడుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధాని మోదీ స్వయంగా తమిళనాడును తన ఇలాకాగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ దిశగా ఆయన ఏప్రిల్ 19 పోలింగ్ లోపు ఎక్కువ సార్లు తమిళనాడుకు వచ్చి వెళ్లాలని నిర్ణయించుకున్నారు..

దక్షిణ చెన్నైలో రోడ్ షో…

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణ చెన్నైలో రోడ్ షో నిర్వహించారు. వీధుల వెంబడి మోదీ వెళ్తుంటే భారీగా జనం గుమ్మిగూడి ప్రధానికి అభివాదం చేశారు. తమిళదేశంలో బీజేపీకి పెరుగుతున్న పాపులారిటీకి ఇదో నిదర్శనంగా నిలిచింది. ఫిబ్రవరి 27 నుంచి ఇప్పటి వరకు మోదీ తమిళనాడుకు ఏడు సార్లు వచ్చారు. జనంతో మమేకమయ్యేందుకు ఆయన ప్రయత్నించారు. తాను కూడా తమిళం నేర్చుకుని ప్రాంతీయ భాషలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని మోదీ ఇటీవల చెప్పుకున్నారు. బీజేపీ, తమిళనాడులో గట్టిగా పాతుకుపోయే క్రమంలో ఉందని చెప్పేందుకు ఇలాంటి స్టేట్ మెంట్స్ దోహదం చేస్తున్నాయి..

నాడు చైనా అధ్యక్షుడికి ఆతిథ్యం…

చైనా అధ్యక్షుడి జిన్ పింగ్ ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు కూడా తమిళనాడు వేదికగా మీటింగ్ జరిగింది. ప్రాచీణ రేపు పట్టణం మహాబలిపురంలోనే మోదీ, జిన్ పింగ్ భేటీ జరిగింది. అప్పటి నుంచి తమిళనాడులో తాను బలపడటమే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తోంది.అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధానినరేంద్ర మోదీ తమిళ కావ్యం తిరుక్కురల్ ను ప్రస్తావిస్తారు. కాశీలోని తమిళం సంగమం సమావేశానికి, తన సొంత రాష్ట్రం గుజరాత్లోని సౌరాష్ట్ర తమిళ సంఘం సమావేశానికి మోదీ హాజరై దక్షిణాది ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు.

తమిళ నేతలకు ప్రాధాన్యం…

తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ తమిళనాడు శాఖాధ్యక్షుడు అన్నామలైకి పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ, తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ పెద్దగా ప్రయోజనం పొందకపోయినా… పట్టు వదలని విక్రమార్కుడిగా పార్టీ పనిచేస్తూనే ఉంది. అన్నాడీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేసిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో 3.6 శాతం ఓట్లు సాధించి ఒక సీటులో కూడా గెలవలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 2.6 శాతం ఓట్లు పొంది నాలుగు సీట్లు గెలుచుకుంది. ప్రస్తుతం అన్నాడీఎంకేతో తెగదెంపులు చేసుకుని ఇతర పార్టీల పొత్తుగా బీజేపీ పోటీ చేస్తోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేతో సంబంధం లేకుండా ముందుకు సాగే క్రమంలో కొంతమేర ప్రయోజనం పొందే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేసుకుంటోంది. పైగా 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెన్నైలోని మూడు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం బీజేపీ దృఢనిశ్చయానికి నిదర్శనంగా నిలుస్తాయి..