వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేసేటప్పుడు ఇలా చేయకండి!

వాషింగ్ మెషిన్ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ కామన్. వాషింగ్ మెషిన్ అవసరం లేని రోజు ఉండదు. అయితే మెషిన్ వేసేటప్పుడు అన్నీ మనకు తెలుసు అనుకుంటాం కానీ చిన్న చిన్న తప్పిదాల కారణంగా మెషిన్ పాడైపోతుంది…ఒక్కోసారి సర్వీసింగ్ చేసినా కానీ బాగుపడదు. అందుకే ఈ విషయాలు తెలుసుకోవాలి…

ఓవర్ లోడింగ్ వద్దు
కరెంట్ వేస్ట్, టైమ్ వేస్ట్ అనే ఉద్దేశంతో వాషింగ్ మెషిన్ నిండా బట్టలు కుక్కేయకండి. సాధారణంగా వాషింగ్ మెషీన్లు వివిధ పరిమాణాలలో వస్తాయి. 6 కిలోల లోడ్, 6.5 కిలోల లోడ్, 7 కిలోల లోడ్ 8 కిలోల లోడ్‌లో లభిస్తుంది. ఆ సామర్థ్యానికి తగ్గట్టుగానే బట్టలు వేసుకోవాలి. అంతకు మించి కుక్కేస్తే మెషీన్ ఓవర్‌లోడ్ అవుతుంది. అవి సరిగ్గా వాష్ చేయలేవు…అప్పుడు యంత్రంపై లోడ్ పెరిగి పాడైపోతుంది. ఫ్రంట్ డోర్ అయితే బట్టలు ఒక్కోసారి రబ్బరులో ఇరుక్కుపోయి పాడైపోతాయి.

పేలే ప్రమాదం
మెషీన్లు బట్టలతో ఓవర్‌లోడ్ చేస్తే పేలే ప్రమాదం కూడా ఉంది. డ్రమ్‌లో బట్టలు నిండిపోతే డిటర్జెంట్ అన్ని భాగాలకు వ్యాపించదు, ఫలితంగా బట్టలు శుభ్రంగా ఉండవు. అందుకే వాషింగ్ మెషీన్‌ కొనుగోలు చేసినప్పుడు దానితో పాటు వచ్చే మొత్తం యూజర్ మాన్యువల్‌ను చదవండి. అందులో పూర్తి వివరాలు ఉంటాయి.

డ్రైయర్ వాడకం వద్దు ఎండే బెటర్
అటోమేటిక్ వాషింగ్ మెషిన్ అయితే ఓకే కానీ సెమీ ఆటో మేటిక్ అయినప్పుడు బట్టలపై నేరుగా సర్ఫ్ వేస్తుంటారు. అది అస్సలు సరికాదు. ముందుగా మెషిన్‌లో నీళ్లు పోసి సర్ఫ్ వేసి కాసేపు అలాగే ఉంచి అందులో బట్టలు వేయాలి. బట్టలు ఉతికేటప్పుడు దుస్తుల జిప్, హుక్ క్లోజ్‌ చేసి వేయాలి. మనం డ్రైయర్ వాడకాన్ని తగ్గించి బట్టలను ఎండలో మాత్రమే ఆరబెట్టడానికి ప్రయత్నించాలి. దీంతో బట్టలు మెరుస్తూ ఉంటాయి.

వారానికోసారి క్లీన్ చేయండి
మెషీన్ మంచి పనితీరు కోసం వారానికి ఒకసారి దానిని డ్రైగా ఉంచాలి. దాని సామర్థ్యం మెరుగవుతుంది. అంతేకాదు వాషింగ్‌ మెషీన్‌ శుభ్రం చేయాలంటే మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం యంత్రం ఎక్కువసేపు పనిచేయడానికి దాని మెయింటనెన్స్‌ కూడా ముఖ్యమే. యంత్రాన్ని శుభ్రం చేయకపోతే అది త్వరగా చెడిపోతుంది.