అప్పుడు పెయిర్ బాలేదన్నారు…ఇప్పుడు అదుర్స్ అంటున్నారు!

దాదాపు 18 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి-త్రిష జంటగా నటిస్తోన్న మూవీ విశ్వంభర. చిరు మూవీలో త్రిష అనగానే పెయిర్ అద్బుతంగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కానీ గతంలో ఇదే పెయిర్ విషయంలో విమర్శలు వెల్లువెత్తాయి…

విశ్వంభర జోడీ అదిరింది
చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తోంది అనగానే పెయిర్ అదిరింది బాసూ అంటున్నారు కొందరు నెటిజన్లు. ఇంకొందరు నెటిజన్లు మాత్రం ఏకిపడేస్తున్నారు. ఎందుకంటే ఇదే కాంబినేష‌న్ ని 18 ఏళ్ల క్రితం స్టాలిన్ టైమ్ లో తెగ విమర్శలు గుప్పించారు. చిరంజీవికి త్రిష కూతురిలా ఉందని, ఆమె హీరోయిన్ ఏంటని , ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్ ఛాయిసా ? చిరు ఛాయిసా ? అంటూ అనే వ్య‌తిరేక‌త వ్య‌క్తమైంది. ఇప్పుడు త్రిషలో హుందాతనం పెరగడంతో …చిరు పక్కన బాగానే సెట్టైంది. పైగా గతంలో కన్నా చిరు స్లిమ్ అవడం కూడా ఓ కారణం. అందుకే ఇప్పుడు వీళ్ల జోడీ కుదిరింది.

అనుష్క, అంజలి కూడా ఉన్నారా!
భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంభరకు బింబిసారతో సక్సెస్ అందుకున్న వశిష్ట మల్లిడి దర్శకుడు. హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా మరో కీలకపాత్రలో అనుష్క శెట్టి కూడా నటిస్తున్నట్లు టాక్. అదిరే గ్రాఫిక్స్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా వచ్చిన ఇంట్రెస్టింగ్ టాక్ ఏంటంటే…విశ్వంభర మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉందని, దాదాపు 30 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ అంజలి నటిస్తోందని టాక్. పైగా అంజలితో చిరు మాస్ బీట్ ఉందని కూడా అంటున్నారు.

స్టాలిన్ లాంటి సక్సెస్ అందుకుంటారా!
చిరు-త్రిష కాంబోలో వచ్చిన స్టాలిన్ మూవీ సక్సెస్ అయింది. దీంతో సేమ్ కాంబోలో వస్తోన్న విశ్వంభరపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను విశ్వంభర అందుకుంటుందా లేదా చూడాలి…