పయ్యావులను గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం – ఉరవకొండలో ఇదే రాజకీయం !?

రాష్ట్ర రాజకీయాలలో ఉరవకొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే వారి పార్టీ అధికారంలో ఉండదు అనేది నానుడి. అయితే ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ ను బద్దలు కొట్టే విధంగా రెండు ప్రధాన పార్టీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ బల ప్రదర్శన చేస్తున్నారు.

మరోసారి గెలిచేందుకు పయ్యావుల ప్రయత్నాలు

తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బరిలో నిలుస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి పోటి చేరుతున్నారు. వీరిద్దరికీ మధ్య మూడో వ్యక్తి కూడా పోటీలోకి రావడంతో ఉరవకొండ రాజకీయం రసవత్తరంగా మారింది. ఆయనే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి సొంత తమ్ముడు మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉరవకొండ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ప్రధాన పార్టీలతో పోటీపడుతూ నియోజకవర్గంలో మధుసూదన్ రెడ్డి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాడు.

పయ్యావుల కేశవ్, విశ్వేశ్వర్ రెడ్డి మధ్య పోటీ

ఉరవకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే టిడిపి నేత పయ్యావుల కేశవ్ ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తన ప్రధాన ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డి నువ్వా నేనా అన్న రీతిలో ఢీ కొంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి తన జాతకాన్ని కూడా పరీక్షించుకోనున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి సిపిఐ ఎంఎల్ పార్టీలో ఉన్న సమయంలో కాంగ్రెస్ లో పొత్తులో భాగంగా సీటు దక్కించుకొని 2004 ఎన్నికల్లో అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డి పై పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వేశ్వర్ రెడ్డి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా రెండవసారి పయ్యావుల కేశవతో పోటీపడి మరోసారి ఓటమి చవిచూశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం మారిన పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉరవకొండ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి పట్టు వదలకుండా మూడవసారి 2014 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ పై పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వేశ్వర్ రెడ్డి టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్ చేతిలో 2,232 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రధాన పార్టీల నుంచి ఈ ఇద్దరు నేతలు పోటీ పడుతుండడంతో ఉరవకొండలో రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. వరుసగా 5 సారీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై పోటీపడుతున్న వై విశ్వేశ్వర్ రెడ్డి తన గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నాడు

మధ్యలో కాంగ్రెస్ నుంచి మధుసూదన్ రెడ్డి

రెండు ప్రధాన పార్టీలు మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో పోటీలో నేను కూడా ఉన్నా అంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తమ్ముడు వై మధుసూదన్ రెడ్డి తన అదృష్టాన్ని ఈ ఎన్నికల్లో పరీక్షించుకునేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు మొన్నటి వరకు వైఎస్ఆర్సిపి లో ఉన్న మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండడంతో వైఎస్ఆర్సిపి ఓట్లను చీల్చుతారని అభిప్రాయాన్ని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మధుసూదన్ రెడ్డి బరిలో నిలవడం టిడిపికి కలిసి వస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.