బరిలో బీసీవైపీ – లోకేష్‌పై రామచంద్ర యాదవ్, పవన్‌పై తమన్నా !

పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ ప్రారంభించిన బీసీవైపీ కూడా బరిలో నిలబడజుతోంది. 32 మందితో బీసీవైపీ తొలి జాబితాను ప్రకటించారు. పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్‌ రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్పు చేసే దిశగా, అసలైన సామాజిక న్యాయం అమలు చేసే దిశగా, రాష్ట్రంలోని అన్నివర్గాలకు సమన్యాయం అందించే దిశగా అడుగులు వేస్తామని అంటున్నారు.

మంగళగిరిలోనూ రామచంద్ర యాదవ్ పోటీ

బీసీవైపీ .పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ రెండు స్థానాల నుండి పోటీ చేయనున్నారు. తన సొంత నియోజకవర్గమైన పుంగనూరుతో సహా, మంగళగిరి నుండి కూడా పోటీకి దిగనున్నారు. రాష్ట్ర రాజధాని రక్షణ, అక్కడ రైతులకు అండగా నిలిచేందుకు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. గతంలో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేశారు. కొంత క్యాడర్ నూ ఆకర్షించారు.

ఎన్నికల గుర్తుగా చెరుకు రైతు

ఖర్చుకు వెనుకాడకుండా రాజకీయం చేస్తున్నారు రామచంద్ర యాదవ్. ఇప్పటికే నియోజకవర్గాల్లో బీసీవైపీ నేతలు విస్తతంగా ప్రచారం నిర్వహిస్తూ పార్టీ ఎన్నికల గుర్తు చెరకు రైతును ప్రజల్లోకి తీసుకువెళ్లారు. బీసీ యువజన పార్టీ నేతల ప్రచారానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ లభిస్తొందని .. . ఇప్పుడు అధికారికంగా అభ్యర్ధుల లిస్ట్‌ ను ప్రకటించినప్పటికీ ముందుగానే ఆయా నియోజకవర్గాల్లో బీసీ యువజన పార్టీ నేతలు గ్రౌండ్‌ వర్క్‌ ప్రెపేర్‌ చేసుకున్నారని అంటున్నారు.

పవన్ పై తమన్నా సింహాద్రి పోటీ

ట్రాన్స్‌జెండర్‌కు తొలిసారి ప్రాధాన్యత దక్కింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ కూడా ట్రాన్స్‌ జెండర్లను పట్టించుకోలేదు. ట్రాన్స్‌ జెండర్లకు చట్టసభల్లో అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో తమన్నా సింహాద్రిని ఫిఠాపురం నియోజకవర్గ అభ్యర్ధిగా బీసీవై పార్టీ ప్రకటించింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై బీసీవై పార్టీ తరపున ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.