హీరోగా దూసుకుపోతున్న స్టార్ కమెడియన్!

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగానూ జోరు పెంచాడు. పెళ్లి చూపులు సినిమాతో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి ప్రతి సినిమాలోనూ తన మార్క్ చూపించాడు. కామెడీ టైమింగ్ తో మెప్పించడమే కాదు హీరోగానూ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు…

బలగం సినిమాతో వెండితెరపై సూపర్ సక్సెస్ అందుకున్న ప్రియదర్శి…సేవ్ ది టైగెర్స్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకులతో ఫుల్ మార్కులు కొట్టేశాడు. ప్రియదర్శితో సినిమా అయినా సిరీస్ అయినా మినిమం గ్యారంటీ అనే టాక్ ఫిక్సైపోయింది. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం సినిమాలో కామెడీ టైమింగ్ తో పాటూ కన్నీళ్లు పెట్టించాడు ప్రియదర్శి. ఆ సినిమా తర్వాత హీరోగా వరుస అవకాశాలు పలకరిస్తున్నాయ్.

ప్రియదర్శి హీరోగా 3 సినిమాలు
ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా ఒక సినిమా మొదలైంది. హనుమాన్ మూవీ నిర్మాతతో నభా నటేష్, ప్రియదర్శి జోడీగా డార్లింగ్ అనే మరో సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా రిలీజైన ఈ టీజర్ కి మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాతో అశ్విన్ రామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే రానా దగ్గుపాటి సొంత ప్రొడక్షన్ లో మరో సినిమాకు కమిటయ్యాడు. అంటే ప్రస్తుతం ప్రియదర్శి చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి.

కమెడియన్ గానూ బిజీ
ఓ వైపు కమెడియన్ గా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే మరోవైపు హీరోగానూ విభిన్న పాత్రలతో సక్సెస్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రియదర్శి చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టులు సక్సెస్ అయితే హీరోగా మరో మెట్టు ఎక్కినట్టే. ఇప్పటికే సుహాస్ కూడా కమెడియన్ గా అడుగుపెట్టి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. పాత్రలో ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడంతో మినిమం గ్యారంటీ హీరోగా ఫిక్సైపోయాడు. ఇప్పుడు ప్రియదర్శి కూడా ఇదే బాటలో ఉన్నాడు. మరి హీరోగా మారిన తర్వాత కమెడియన్ పాత్రలు వదిలేస్తాడా? వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటాడా అన్నది చూడాలి.