భారతీయ జనతా పార్టీ గెలిస్తే హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మారుస్తామని ప్రకటించింది. కానీ బీఆర్ఎస్ ముందుగానే ఆ పేరు పెట్టింది. కావాలంటే ఆ పార్టీ అధికారి సోషల్ మీడియా ఖాతాలను చూడండి.
బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో హైదరాబాద్ పేరు భాగ్యనగర్ అని ఒక పోస్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఒక పోస్టు చేసింది. ఆ పోస్టులో “భాగ్యనగర కీర్తి కిరీటంలో కొత్తగా చేరిన మూడు రత్నాలు” అని క్యాప్షన్ రాసి ఉంది. ఆ మూడు రత్నాలు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం, తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం.
సోషల్ మీడియా పోస్టుల్లో హైదరాబాద్ పేరు భాగ్యనగర్ గా చెబుతున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా వర్ణించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీ డిమాండ్.. తాము అధికారంలోకి వస్తే చేస్తామనే హామీ. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ అగ్ర నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అది ప్రజల మనసుల్లో ఉందనుకున్నారేమో కానీ భాగ్యనగర్ అని ఎక్కువగా సంబోధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక నిర్దిష్ట వర్గం మెప్పు పొందేందుకే బీజేపీ హైదరాబాద్ పేరు మార్పు అంశం తెరపైకి తెస్తోందని, ఇది రాజకీయ జిమ్మిక్కు అని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు తరచూ కౌంటర్ ఇస్తుంటాయి. ఇప్పుడు అదే పని బీఆర్ఎస్ చేయడం ఆశ్చర్యకరంగా మారింది.
హైదరాబాద్ పేరు మారుస్తామని బీజేపీ హామీ
తెలంగాణలో హైదరాబాద్ పేరు మార్పు వివాదం చాలా కాలంగా నలుగుతోంది. చారిత్రక, సాంస్కృతిక కారణాలను చూపుతూ పేరు మార్పు కోసం బీజేపీ డిమాండ్ చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. నిజానికి పలుమార్లు ఈ అంశంపై బీఆర్ఎస్ భాగ్యనగరం అని స్పందించినా వివాదం కాలేదు. కానీ ఈ సారి మాత్రం హైలెట్ అవుతోంది దీనికి కారణం పాతబస్తీ పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) తీవ్రంగా ఖండించడమే.
మండిపడుతున్న ఎంబీటీ.. సైలెంట్ గా ఉన్న ఎంఐఎం
ఇప్పుడు టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు భాగ్యనగర్ పేరును హైదరాబాద్‌కు పెట్టి రాజకీయంగా లబ్దిపొందేందుకు కొన్నివర్గాలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అని ఎంబీటీ నేత అమ్జాదుల్లా ఖాన్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ చర్యను ఆయన ఖండించారు. హైదరాబాద్‌కు భాగ్యనగర్ అని పేరు పెట్టలేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ పేరు గురించి ఆర్టీఐ ద్వారా గతంలో అడిగిన ప్రశ్నకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సమాధానం ఇస్తూ.. హైదరాబాద్ పేరును మార్చబోవడం లేదని స్పష్టం చేశారు. మొత్తంగా బీఆర్ఎస్ తీరులో మార్పు వస్తోందన్నమాట.