కేసీఆర్ ఇక బీజేపీని విమర్శించరా ? – ఈ సూచనలు దేనికి సంకేతం ?

అయిన దానికి కాని దానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని నిందించే కేసీఆర్, కేటీఆర్‌లకు ఇటీవల గొంతు పెగడం లేదు గమనించారా ? బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బీజేపీపై యుద్ధం కోసమే.. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేశానని ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే ఆయన నిన్నామొన్నటి దాకా బీజేపీని టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆయన నోటి నుంచి కాంగ్రెస్ ను మాత్రమే విమర్శిస్తున్న మాటలు వస్తున్నాయి. బీజేపని పల్లెత్తు మాట అనడం లేదు. ఈ మార్పు ఎందుకో బీఆర్ఎస్ క్యాడర్ కూడా అర్థం కావడం లేదు.

కాంగ్రెస్ ను మాత్రమే విమర్శిస్తున్న కేసీఆర్

ఎమ్మెల్యేలు, ఎంపీలతో తెలంగాణ భవన్ లో సమావేశం అయ్యారు. బీజేపీని పల్లెత్తు మాట అన్నట్లుగా ఎవరూ చెప్పలేదు. 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని విమర్శించినట్లుగా చెప్పుకొచ్చారు. అంతేనా నాందెడ్‌లో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు శిక్షణా శిబిరం పెట్టి ప్రసంగించారు. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ, షిండే ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.ఆయన తీరును బట్టి చూస్తే బీజేపీ విషయంలో క్లారిటీ వచ్చిందని.. మళ్లీ తిరుగులేని మెజార్టీతో దేశంలో అధికారంలోకి వస్తుందని… ఆ పార్టీతో దూకుడుగా వెళ్లడం రిస్క్ అని అనుకుంటున్నట్లుగా బీఆర్ఎస్‌లోనే ప్రచారం జరుగుతోంది.

బీజేపీతో రాజీ చేసుకున్నామన్న సంకేతాలు పంపడానికా ?

కేసీఆర్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఏ పార్టీని అయినా టార్గెట్ చేయాలనుకుంటే ఆ పార్టీతో సన్నహితంగా ఉన్నట్లుగా సంకేతాలు పంపుతారు. బీఆర్ఎస్ తో.. బీజేపీ సన్నిహితంగా ఉందని ప్రచారం చేయడానికి ఆయన ఇలా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏ వ్యూహంతో ఉన్నాయో తెలియదు కానీ..కవిత అరెస్ట్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బీజేపీతో రాజీ చేసుకున్నందునే అరెస్ట్ కాలేదన్న ప్రచారాన్ని బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నాయి. అయితే దర్యాప్తు సంస్థలు ఏం చేయాలనుకుంటే అవి చేస్తాయి కానీ బీజేపీకి ఏం సంబంధం అనేది ఎవరికీ అర్థం కాని విషయం.

ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం కనీసం తలసానిని కూడా ఎందుకు పంపలేదు?

ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ .. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కన్నా బిజీగా మారుతుందని కేసీఆర్ తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరినప్పుడు జోస్యం చెప్పారు. అయినా నాలుగు నెలల తర్వాత ఏపీలో ప్రారంభించిన ఆ పార్టీ ఆఫీసు కార్యక్రమాన్ని ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ నుంచి తలసాని లాంటి వాళ్లను కూడా పంపలేదు. చివరికి .. పార్టీ ఆఫీసును తానే ప్రారంభించుకున్నారు తోట చంద్రశేఖర్. గుట్టుగా గుంటూరులోనే ఆఫీసు తీసుకుని సైలెంట్ గా ప్రారంభించేశారు. దిగాం కాబట్టి తోట చంద్రశేఖర్ కు పార్టీ ఆఫీసు ప్రారంభించక తప్పలేదు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడం ఆయనకు ఇబ్బందే. కానీ కేసీఆర్ ను నమ్ముకున్నారు కాబట్టి.. ఈదక తప్పదని ఆయనకు అర్థం అయిపోయింది.