పులివెందులలో జగన్ విజయంపై ఎవరికీ అనుమానాల్లేవు కానీ గతంలో వచ్చినంత మెజార్టీ వస్తుందా అన్న చర్చలు మాత్రం సాగుతున్నాయి. దీనికి కారణం షర్మిల,సునీత జగన్ కు వ్యతిరేకంగా పని చేయడం మాత్రమే కాదు.. కుటుంబంలో చీలికలు రావడం.. వైసీపీ కీలక నేత , పులివెందుల వ్యవహారాలు చూసుకునే శివశంకర్ రెడ్డికి బెయిల్ వచ్చినా హైదరాబాద్ లోనే ఉండాల్సి రావడం వంటివి సమస్యలుగా కనిపిస్తున్నాయి.
టీడీపీ లక్ష్యం మెజార్టీ తగ్గించడమే !
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెజార్టీ తగ్గించడమే ధ్యేయంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఒకవైపు పులివెందులలో టిడిపి జెండా ఎగురవేయడం సాధ్యం కాదని వారికీ తెలుసు. కానీ జగన్ మోజార్టీని తగ్గిస్తే అది విజయమే అన్నట్లుగా ఉన్నారు. టిడిపి అభ్యర్థి బి టెక్ రవి, మరోవైపు జగన్ సోదరీమణులు పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పులివెందులలో సాధించిన 91 వేల మెజార్టీ తగ్గించాలనే పట్టుదలతో ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్న నేపథ్యంలో అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది.
టిడిపి వ్యూహాత్మక పావులు
పులివెందుల ఎన్నికల బరిలో వైసిపి తరపున జగన్, టిడిపి తరపున బి టెక్ రవి, కాంగ్రెస్ తరపున ధ్రువకుమార్‌రెడ్డి నిలిచారు. నియోజకవర్గంలో 2,23,453 ఓటర్లున్నారు. ఏడాది కిందట పులివెందుల టిడిపి అభ్యర్థిగా రవి పేరును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే అన్ని రకాల అండదండలు అందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో టిడిపి అభ్యర్థి రవి సకుటుంబ సపరివార సమేతంగా ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు.
లక్ష మెజార్టీని దాటించాలని వైసీపీ నేతల ప్రయత్నాలు
వైఎస్ షర్మిల, సునీత సెంటిమెంటు రాజకీయంతో వైసిపిలో కాస్త గందరగోళం ఏర్పడింది. వైఎస్ మనోహర్‌రెడ్డి నాయకత్వంలో పులివెందుల, లింగాలకు వైఎస్ అభిషేక్‌రెడ్డి, వేంపల్లికి ఎస్వి సతీష్‌రెడ్డి, వేముల మరక శివరామిరెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్ కొండారెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, తొండూరు మండల ఎంపిపి రవిశంకర్ నాయకత్వాన ఎన్నికల ప్రచారాల్ని వేగవంతం చేశారు. వైఎస్ భారతి రెడ్డి మొత్తం పర్యవేక్షిస్తున్నారు. లక్ష మెజార్టీని దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.