Secunderabad Fire Accident : సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. 4వ ఫ్లోర్ లో స్పృహ లేకుండా పడి ఉన్న ఆరుగురిని అగ్నిమాపక సిబ్బంది గుర్తించింది. వీరిలో ఐదుగురిని గాంధీ ఆసుపత్రికి ఒకరిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ ఆరుగురు చనిపోయారు.
మృతులను ప్రశాంత్, ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణిగా గుర్తించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివ మరణించాడు. దట్టమైన పొగకు ఊపిరాడక ఆరుగురు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతులంతా 4వ అంతస్తులో వారేనని గుర్తించారు. మరోవైపు స్వప్నలోక్ కాంప్లెక్స్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది సుమారు ఏడుగురిని ప్రాణాలతో కాపాడారు. ఆరుగురిని మాత్రం ప్రాణాలతో కాపాడలేకపోయారు. వీరంతా బాత్ రూమ్ లో లాక్ చేసుకుని తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేశారు.
అయితే, 4వ ఫ్లోర్ నుంచి 9 ఫ్లోర్ల వరకు దట్టమైన పొగ అలుముకోవడంతో వారంతా అపస్మారక స్థితికి వెళ్లారు. సుమారుగా 3 గంటల పాటు 5వ ఫ్లోర్ లో తలదాచుకున్నారు. అయితే, పీల్చుకోవడానికి ఆక్సిజన్ లేకపోవడంతో వారంతా అపస్మారక స్థితికి వెళ్లారు. కొన్ని గంటల తర్వాత మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లగలిగారు.
కాల్ సెంటర్ లో పని చేస్తున్న వారు 4వ ఫ్లోర్ లో తలదాచుకున్నారు. వారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఘోరం జరిగిపోయింది. వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు. అత్యవసర చికిత్స కోసం వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రికి తరలించిన ఐదుగురు చనిపోయారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివ చనిపోయాడు. మృతులంతా కాల్ సెంటర్ లో పని చేస్తున్న వారే.
సికింద్రాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం రూబీ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ తర్వాత రాంగోపాల్ పేటలోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదాలు మరువక ముందే.. ఇప్పుడు సికింద్రాబాద్ పరిధిలోని మరో కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం జరగడం కలకలం రేపింది.
సికింద్రాబాద్‌లో రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం(మార్చి 16) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. మృతుల్లో వరంగల్‌కు చెందిన ముగ్గురు, ఖమ్మంకు చెందిన ఒకరు, ఇద్దరు మహబూబాబాద్ వాసులు ఉన్నారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారు అపోలో, యశోద ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి 7.45 నిమిషాలకు స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలో తొలుత మంటలు చెలరేగడంతో నాలుగు, ఐదు, ఆరు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
మంటలు వ్యాపించిన నాలుగు, ఐదు, ఆరు అంతస్తుల్లో మొత్తం ప్రైవేట్ కార్యాలయాలున్నాయి. మంటల వ్యాప్తికి పలువురు వ్యక్తులు అందులోనే చిక్కుకుపోయారు. మంటల తీవ్రత పెరిగే అవకాశముందని భావించిన అధికారులు సమీప నివాసాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు. సహాయ చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది.. సురక్షితంగా ఉన్న ఏడుగురిని ప్రాణాలతో కాపాడారు. స్పృహ తప్పిపోయిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. నాలుగు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
మృతి చెందిన ఆరుగురు 4 అంతస్తులో ఒక రూంలో చిక్కుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. డోర్లు బద్దలు కొట్టి వారిని బయటకు తీసుకొచ్చినప్పటికీ స్పృహ కోల్పోయి ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి ఐదుగురు మృతి చెందినట్లు తెలిపారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరంతా దట్టమైన పొగతో ఊపిరాడకనే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.