రాముడిలో మాత్రమే ఉండే ప్రత్యేకమైన 16 గుణాలు ఇవే!

రాముడి లక్షణాలు గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాల గురించి వాల్మీకి మహర్షితో చెప్పాడు నారదుడు. ఇవి ఇవే…

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం.. దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం విష్ణుమూర్తి మానవరూపంలో ధరణిపై అవతరించి, ధర్మ సంస్థాపన చేసిన అవతారం ఇది. చైత్రమాసం నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించాడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను కన్న బిడ్డల్లా పాలించిన మహారాజుగా, భార్య కోసం పరతపించిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల సుగుణాలు కలబోసిన రాముడిలో అత్యంత ప్రత్యేకంగా 16 గుణాల గురించి చెబుతారు.

  1. గుణవంతుడు 2. వీర్యవంతుడు 3. ధర్మాత్ముడు 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు 5. సత్యం పలికేవాడు
  2. దృఢమైన సంకల్పం కలిగినవాడు 7.వేద వేదాంతాలను తెలిసివాడు 8.అన్ని ప్రాణుల మంచి కోరేవాడు
  3. విద్యావంతుడు 10.సమర్థుడు 11.ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత అందగాడు
  4. ధైర్యవంతుడు 13. క్రోధాన్ని జయించినవాడు 14. తేజస్సు కలిగినవాడు 15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు
  5. అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించేవాడు
    ఈ సుగుణాలే రాముడిని ఆదర్శ పురుషుడిగా నిలబెట్టాయి…

అందుకే ఆదర్శపురుషుడు రామచంద్రుడు
భారతదేశంలో ధర్మ బద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు. మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి.. మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు. రామావతారంలో రాముడు పరిపూర్ణంగా మానవుడే. అందుకే ఎ రాముడు తాను దేవుడిని అని , దైవత్వం గురించి ప్రకటించడం కానీ చేయలేదు . “రామస్య ఆయనం రామాయణం” అంటారు కదా మరి రాముడి కదలికకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది. అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం . ఆయన నడక ఆయన కదలిక అంతా సత్యం ధర్మమే అందుకే “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు .