తిరుపతిలో సర్దుకున్న కూటమి – ఆరణికి అన్నిపార్టీల నేతల సపోర్ట్

తిరుపతి సీటులో ఎన్డీఏ కూటమిలో ఏర్పడిన వివాదాలన్నీ పరిష్కారమయ్యాయి. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు.. అన్నిపార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తిరుపతికి వచ్చారు. జనసేన టిక్కెట్ సాధించారు. దీంతో చాలా కాలంగా అక్కడ పని చేసుకుంటున్న నేతలంతా ఆయన గెలుపు కోసం పని చేయాల్సి వస్తోంది.

అచ్చెన్నాయుడు సర్దిచెప్పడంతో మెత్తబడిన సుగుణమ్మ

తిరుపతిలో జనసేన కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాస్‌ను ప్రకటించినప్పటి నుంచి టిడిపిలో మాజీ ఎంఎల్‌ఎ ఎం.సుగుణమ్మ ఆధ్వర్యంలో చిచ్చు రగులుతూనే ఉంది. మీడియా వేదికగా ఎం.సుగుణమ్మ ఆరణి శ్రీనివాస్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే టిడిపి అధినేతలు నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌, అచ్చెంనాయుడు జోక్యంతో ఒకింత మెత్తబడిన ఎం.సుగుణమ్మ ఆరణి శ్రీనివాసులుకు మద్దతు ఇస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.
ఆరణి శ్రీనివాసులు సోమవారం ఎం.సుగుణమ్మ ఇంటికి స్వయంగా వెళ్లి మద్దతు కోరారు. పొత్తులో భాగంగా తిరుపతి ఎంఎల్‌ఎ టికెట్‌ జనసేనకు కేటాయించారని, కలసికట్టుగా టిడిపి శ్రేణులంతా ఐక్యంగా ఎన్నికల్లో పనిచేయాలన్నారు. ఎన్నికల్లో ఆరణి శ్రీనివాస్‌ను గెలిపించుకుని మహాకూటమికి కానుక ఇవ్వాలన్నారు.

అందర్నీ కలుపుకుని వెళ్తనన్న ఆరణి శ్రీనివాసులు

చంద్రబాబు ఆధ్వర్యంలో మహా కూటమి ఏర్పడిందని ఆరని శ్రీనివాసులు తెలిపారు. వైసీపీని బంగాళాఖాతంలో తోయడమే మూడు పార్టీల లక్ష్యమన్నారు. చంద్రబాబు నాయుడుని మరోసారి ముఖ్యమంత్రిని చేయటం తథ్యమని ఆరని శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా అభినయ రెడ్డి చేసిన అక్రమాలను కక్కిస్తామన్నారు. తిరుపతిలో భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో 50 డివిజన్లలోని టీడీపీ, జనసేన నేతలందరినీ కలుపుకొని వెళ్తామన్నారు. తిరుపతిలోని టీడీపీ నేతలతో పాటు, తిరుపతి టీడీపీ ఇన్చార్జి సుగుణమ్మ ఆశీస్సులు సూచనలు సలహాలు తీసుకొని నడుచుకుంటామని ఆరని శ్రీనివాసులు పేర్కొన్నారు.

రాజకీయం అంటే ఇదే మరి !

తిరుపతిలో భూమనకు వ్యతిరేకంగా ఐదేళ్లు సుగుణమ్మ, కిరణ్ రాయల్ పోరాడారు. బీజేపీకి చెందిన భానుప్రకాష్ రెడ్డి కూడా పోరాడారు. కానీ చివరిలో వైసీపీకి చెందిన ఆరణి టిక్కెట్ దక్కించుకున్నారు. దీంతో అందరూ ఆయన కోసం పని చేయాల్సి వస్తోంది. రాజకీయం అంటే ఇదేనని వారు నిరాశపడాల్సి వచ్చింది.