కంటెంట్ ఇంపార్టెంట్ అంటున్న బడా నిర్మాణ సంస్థలు!

తెలుగులో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలన్నీ ఇప్పుడు కంటెంట్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. అలా అని కటౌట్ పట్టించుకోలేదా అంటే అదేంలేదు.. ఓవైపు భారీ బడ్జెట్ మూవీస్ తెరకెక్కిస్తూనే మరోవైపు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న బ్యానర్ కి అనుబంధంగా కొత్త ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు.

గీతా ఆర్ట్స్ – GA2 పిక్చర్స్
టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ తన తండ్రి స్థాపించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించాడు. సేమ్ టైమ్ GA2 పిక్చర్స్ సంస్థను ఏర్పాటు చేసి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నాడు. మరోవైపు ఆహా ఓటీటీ ద్వారా విభిన్నమైన కంటెంట్ తో వచ్చే యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తున్నాడు. ఈ మధ్యే ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో హిట్టు కొట్టారు. ప్రస్తుతం ‘తండేల్’ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ చేస్తూనే మరోవైపు బోయపాటి సినిమాను లైన్ లో పెట్టారు.

SVC – దిల్ రాజు ప్రొడక్షన్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సినిమాలు నిర్మిస్తోన్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు …గతేడాది ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి.. రెండో తరం వారసులు హన్షిత రెడ్డి, హర్షిత్‌ రెడ్డిలను నిర్మాతలుగా పరిచయం చేశారు. ఇదే బ్యానర్ లో వచ్చిన బలగం అదిరిపోయే హిట్టందుకుంది. ప్రస్తుతం ఆశిష్ హీరోగా ‘లవ్ మీ’, సుహాస్ హీరోగా ‘ఆకాశం దాటి వస్తావా’ మూవీస్ చేస్తున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ – సితార ఎంటర్టైన్మెంట్స్
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ… త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తుంటారు. దానికి అనుబంధ సంస్థగా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ను ఏర్పాటు చేసి తన సోదరుని కుమారుడు సూర్యదేవర నాగవంశీ పేరు మీద సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అలానే ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ అనే బ్యానర్ ను స్థాపించి త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్యను కూడా నిర్మాణంలో భాగం చేస్తూ వస్తున్నారు. ‘మ్యాడ్’ మూవీతో హిట్టు కొట్టి ‘టిల్లు స్క్వేర్’ తో ఆ హిట్ కొనసాగించారు.

యూవీ క్రియేషన్స్ – V సెల్యులాయిడ్
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించారు నిర్మాతలు వంశీ, ప్రమోద్…’V సెల్యులాయిడ్’ పేరుతో మరొక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించారు. ‘గామి’ లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని అందించడంతో పాటూ ‘ఓం భీమ్ బుష్’ తో మరో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం సుధీర్ బాబుతో ‘మా నాన్న సూపర్ హీరో’…మరోవైపు చిరంజీవితో ‘విశ్వంభర’ లాంటి భారీ సోషియో ఫాంటసీ జోనర్ సినిమా నిర్మిస్తున్నారు.

వైజయంతీ మూవీస్ – స్వప్న సినిమాస్
తెలుగు చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకుంటున్న వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద ఇప్పటి వరకూ ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించారు నిర్మాత అశ్వినీ దత్. ఆయన కుమార్తెలు ‘స్వప్న సినిమాస్’ అనే మరో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి చిన్న సినిమాలు, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ‘మహానటి’, ‘జాతిరత్నాలు’ ఈ బ్యానర్ నుంచే వచ్చాయి. ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ వంటి అత్యంత భారీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు

మైత్రీ మూవీ మేకర్స్ & AK ఎంటర్టైన్మెంట్స్
మైత్రీ మూవీ మేకర్స్ ..ఇతర భాషల్లో రూపొందిన ‘ది గోట్ లైఫ్ – ఆడు జీవితం’, ‘మంజుమ్మల్ బాయ్స్’ లాంటి కంటెంట్ మూవీస్ ను తెలుగు ఆడియెన్స్ కు అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాత అనిల్ సుంకర.. మరోవైపు ఇతర నిర్మాతలతో కలిసి మంచి కంటెంట్ తో మీడియం రేంజ్ సినిమాలు నిర్మిస్తున్నారు.