తెలంగాణ కాంగ్రెస్ “సెల్ఫ్ ట్రోల్”

కాంగ్రెస్ ను ఎవరూ ఓడించాల్సిన పని లేదు. వాళ్లకు వాళ్లే ఓడించుకుంటారు. నిన్నటిదాకా ఇదే మాట. ఇప్పుడు వాళ్లను ప్రత్యేకంగా ఎవరూ ఎగతాళి చేయాల్సిన పని లేదు. వాళ్లను వాళ్లే కించపర్చుకుంటారని చెప్పుకోవాలి. తాజాగా తమ పార్టీ నేతల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఆ పార్టీ నేతలే పోలీసులకు దొరికిపోయారు. తమ పార్టీ నేతలే ట్రోల్ చేస్తున్నారని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తే కాంగ్రెస్ నేతల్ని ట్రోల్ చేసింది సొంత సోషల్ మీడియా సైన్యమేనని తేలింది.

కాంగ్రెస్ సోషల్ మీడియా సైన్యం ట్రోల్ చేసేది వాళ్ల పార్టీ నేతల్ని

సాధారణంగా ప్రతీ పార్టీకి సోషల్ మీడియా సైనికులు ఉంటారు. వారు తమ పార్టీ గొప్పదనంతో పాటు ఇతర పార్టీల నేతల్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం.. ‘కట్టప్ప’లు ఒకరికొకరు గోతులు తీసుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. దీని వెనుక ఎవరున్నారన్న దానిపై సైబర్‌క్రైం పోలీసుల దర్యాప్తులో స్పష్టత వస్తుందా? టీపీసీసీ మాజీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కించపరుస్తూ పోస్టులు పెట్టించిన యూత్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వార్‌రూమ్‌ ఇంచార్జి ప్రశాంత్‌కు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఆయన బాస్‌ ఎవరు? ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి సోషల్‌ మీడియా వింగ్‌లను ఏర్పాటు చేశాడు? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ లో ఉత్తమ్ కలకలం

ఉత్తమ్‌కు వ్యతిరేకంగా పోస్టింగ్‌లు ఎందుకు పెడుతున్నారు? ఆ వ్యవహారం వెనుక ఎవరున్నారన్న దానిపై సోమవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సైబర్‌ క్రైం పోలీసులు ఇప్పటికే సీఆర్పీసీలోని సెక్షన్‌ 41 కింద ప్రశాంత్‌కు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్‌లో ఒకరిద్దరు ప్రధాన నాయకులకు ప్రశాంత్‌ వీరవిధేయుడిగా మెలిగినట్టు ఆ పార్టీ లో చర్చించుకుంటున్నారు. పోలీసుల విచారణలో ప్రశాంత్‌ ఆ నాయకుల పేర్లను చెప్తే వారి కి నష్టం జరిగే అవకాశాలున్నాయి. సోషల్‌ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నదెవరో తెలుసని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఉత్తమ్ ప్రకటించారు. యాదృచ్ఛికంగా బీఆర్‌ఎస్‌ నేతలను కలిశానని.. తాను, తన సతీమణి పద్మావతి పార్టీ మారుతున్నట్టు కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్యనేతలే దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆయనంటున్నారు.

ఒకరిపై ఒకర ఆధిపత్యం కోసమే కాంగ్రెస్ రాజకీయాలు !

సీనియర్లకు చెక్‌ పెట్టేందుకు జూనియర్‌ నాయకులు పక్కా వ్యూహాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా నేరుగా ఆరోపణలు చేస్తే అందరికీ తెలిసిపోతుందన్న భావనతో సోషల్‌ మీడియాపై ఆధారపడ్డారు. సీనియర్లకు వ్యతిరేకంగా ఎక్కడి నుంచి పోస్టింగ్‌లు పెడుతున్నదీ తెలియకుండా చూసుకునేందుకు ఇతరుల పేర్లతో సిమ్‌కార్డులు తీసుకుని వాట్సప్‌కు మాత్రమే వాడుతున్నారు. ఈ వ్యవహారాలను చూసి.. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా.. తాము రాజకీయం ఎందుకు చేస్తున్నామో తెలియని స్థితికి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ అంటే ఇంతేనేమో అనుకుంటున్నారు.