గుణలో సింథియాకు సునాయాసం ?

ఒక పక్క ప్రధాని మోదీ కరిష్మా, మరో పక్క రాజకుటుంబీకుడైన ప్రజానాయకుడి పరపతి. అప్పుడేమవుతుందంటే వార్ వన్ సైడ్ కావడమే కాదా. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని గుణ లోక్ సభా నియోజకవర్గంలో కూడా అదే పరిస్తితి కనిపిస్తోంది. ఎవరిని కదిలించినా.. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా సునాయాసంగా గెలిచి పోతారని కుండబద్దలు కొట్టేస్తున్నారు…

అన్ని వర్గాల మద్దతు జ్యోతిరాదిత్యకే…

మధ్యప్రదేశ్లోని అతి పెద్ద నియోజకవర్గాల్లో గుణ ఒకటి. అక్కడ అనేక పర్యాయాలు జ్యోతిరాదిత్య రాజకుటుంబీకులే గెలిచారు. జనంలో వారికి మంచి పేరుంది. టీ కొట్టు నడిపే వ్యాపారి నుంచి వందల కోట్లకు పడగెత్తిన అధిపతి వరకు ఎవరిని కదిలించినా కూడా సింథియాకే ఓటేస్తామని చెబుతున్నారు. నియోజకవర్గం ప్రజలందరూ ఒక వైపు ఉన్నారని, అదీ జ్యోతిరాదిత్య సింథియా వైపేనని ప్రకటిస్తున్నారు. ఆయన సేవలను అందరూ ప్రశంసిస్తున్నారని, పన్నులు ఎగవేసిన దొంగలు మాత్రమే ఆయన్ను వ్యతిరేకిస్తున్నారని కూడా అంటున్నారు…

వసతుల కల్పనలో సింథియా ముందంజ

జ్యోతిరాదిత్య కాంగ్రెస్ పాలనలో కూడా చక్రం తిప్పిన నాయకుడు. ఆయన మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గానికి ఆయన నిత్యం సేవలు చేస్తూనే ఉన్నారు. గ్వాలియర్ విమానాశ్రయం ఆధునీకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. రైల్వే మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కృషి చేస్తున్నారు. వ్యవసాయానికి తాగునీరు, సామాన్య ప్రజలకు సాగు నీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. నియోజకవర్గాన్ని ఆయన కన్నబిడ్డలా చూసుకునేవారని, ఐనా గత ఎన్నికల్లో ఓడించి తప్పు చేశామని జనం అంగీకరిస్తున్నారు. అప్పుడాయన కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు…

ప్రభావం చూపలేని కాంగ్రెస్ అభ్యర్థి

కాంగ్రెస్ పార్టీ తరపున గుణలో రావ్ యద్వేంద్ర సింగ్ యాదవ్ బరిలోకి నిలిచారు. ఆయన ఒకప్పుడు బీజేపీలో ఉండేవారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి జంప్ చేసి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేశారు. ఘోర పరాభవం పాలయ్యారు. ఆయన తండ్రి దేశ్ రాజ్ సింగ్ యాదవ్ ..గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించారు. గుణలోని అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో ప్రజాదరణ ఉన్న కారణంగా యద్వేంద్ర సింగ్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో వెనుకబడిపోవడం ఒకటైతే.. జనం ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడం మరో అంశం. పైగా సింథియా వల్ల తమ నియోజకవర్గానికి వైద్య కళాశాల, ఇంజనీరింగ్ కాలేజీ వచ్చాయని స్థానిక యువత గుర్తుచేస్తోంది. ఇప్పుడు సింథియా ఒక మాట చెబుతున్నారు. మెదీ జీ కి గ్యారెంటీ, సింథియాకి మేహనత్. అంటే మోదీ గారి గ్యారెంట్, సింధియా గారి శ్రమ అని అర్థం. అది వర్కవుట్ అవుతుందని కూడా బీజేపీ విశ్వసిస్తోంది..