సుబ్బారావు పుస్తకం – కాంగ్రెస్ తీరును ఎండగట్టిన బీజేపీ

కాంగ్రెస్ పార్టీని అంటేనే తిమ్మిని బొమ్మిని చేసే వ్యవస్థ. లేనిది ఉన్నట్లుగా చూపే పార్టీ. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే గ్రూపు. ఎప్పుడు చూసినా అడ్డదారులే తొక్కడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెల్లింది. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన తెలుగు వారు దువ్వూరి సుబ్బారావు రాసిన ఒక పుస్తకంలో కూడా ఇదే అంశాన్ని కుండ బద్దలు కొట్టారు. దీనితో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. బీజేపీ ఇక ఫుల్ అఫెన్స్ ఆడేస్తోంది…

సుబ్బారావుపై ప్రణబ్, చిదంబరం ఒత్తిడి…

ప్రణబ్‌ ముఖర్జీ, పి. చిదంబరం ఆర్థిక మంత్రులుగా పని చేసిన సమయంలో సానుకూల సెంటిమెంటు కోసం వడ్డీ రేట్లను తగ్గించాలని, వృద్ధి రేటును పెంచి చూపాలని తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉండేవని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. ‘జస్ట్‌ ఎ మెర్సినరీ? నోట్స్‌ ఫ్రమ్‌ మై లైఫ్‌ అండ్‌ కెరియర్‌’ పేరిట రాసిన స్వీయకథలో దువ్వూరి ఈ విషయాలు పేర్కొన్నారు. వడ్డీ రేట్ల విషయంలోనే కాకుండా ఇతరత్రా అంశాల్లోనూ ప్రభుత్వం నుంచి ఆర్‌బీఐపై ఒత్తిడి ఉండేదని ఒక అధ్యాయంలో ఆయన ప్రస్తావించారు. ‘ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయమిది. ఆర్థిక కార్యదర్శి అరవింద్‌ మాయారాం, ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్‌ బసు మా అంచనాలను సవాలు చేశారు.సానుకూల సెంటిమెంటును పెంపొందించాల్సిన భారాన్ని ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ కూడా పంచుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు సెంట్రల్‌ బ్యాంకులు సహకరిస్తుంటే మన దగ్గర మాత్రం ఆర్‌బీఐ తిరుగుబాటు ధోరణిలో ఉంటోందంటూ మాయారాం వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆర్‌బీఐ చీర్‌లీడరుగా ఉండాలన్న డిమాండ్‌కి నేను తలొగ్గలేదు’ అని దువ్వూరి రాసుకొచ్చారు. వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఆర్‌బీఐపై చిదంబరం తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు దువ్వూరి చెప్పారు. పరిస్థితులను సమీక్షించిన మీదట తాను అంగీకరించలేదన్నారు. దీంతో కలవరానికి గురైన చిదంబరం అసాధారణ రీతిలో ఆర్‌బీఐపై అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారని వివరించారు.

కాంగ్రెస్ పార్టీని కడిగిపారేసిన బీజేపీ

మాజీ గవర్నర్ సుబ్బారావు రాసిన తాజా పుస్తకం ఆధారంగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఓ రేంజ్ లో విరుచుకుపడింది. వ్యవస్థలను మేనేజ్ చేసి ఆ పార్టీ దశాబ్దాల పాటు దేశాన్ని అథోగతిపాలు చేసిందని ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ నిత్యం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, దేశ ప్రజలందరినీ మోసగించిందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దుష్ట పరిపాలన కారణంగానే యూపీఏ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, అన్ని రంగాలు దెబ్బతిన్నాయని ఆమె అన్నారు.

ఎదుటివారికి చెప్పడమేనా కాంగ్రెస్ పని…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని ఆమె అన్నారు. వ్యవస్థలను గౌరవించకుండా, స్వయం ప్రతిపత్తిగా పనిచేయాలని శాఖలకు స్వేచ్ఛ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేసేదన్నది సుబ్బారావు పుస్తకం ఆధారంగా బయటపడిందని నిర్మలమ్మ వ్యాఖ్యానించారు. తప్పుడు సమాచారాన్ని, మార్చిన గణాంకాలను జనంపై రుద్దడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జీ అమిత్ మాలవీయ ఆరోపించారు…