చారిత్రక ఎన్నికలకు ఎల్లుండే శ్రీకారం

భారత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేస్తోంది. ప్రజాస్వామ్య పండుగగా పిలిచే లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. చైత్రమాసంలో మొదలై ఏడు దశలుగా జరిగే ఎన్నికల్లో తొలి అంకం శుక్రవారం ( ఎల్లుండి) జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వస్తాయి..

97 కోట్ల మంది ఓటర్లు

దేశ జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ క్రమంలో కొత్త తరం ఓటర్లు వచ్చి చేరుతున్నారు. ఈసారి 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గత ఎన్నికలతో పోల్చితే అది ఆరు కోట్లు అధికం. ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసం 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లలో 49.72 కోట్ల మంది పురుషులు కాగా, 47.1 కోట్ల మంది మహిళలున్నారు. వారి కోసం 55 లక్షల ఈవీఎంలు ఏర్పాటు చేశారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 17 లోక్ సభ ఎన్నికలు, 16 రాష్ట్రపతి ఎన్నికలు, 400కు పైగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. చిన్న చిన్న సంఘటనలు మినహా అన్ని ఎన్నికలు సజావుగా సాగిపోవడం మన శాంతికాముకతకు నిదర్శనమని చెప్పాలి…

ఎక్కువకాలం జరుగుతున్న రెండో ఎన్నికలు

ఈ సారి ఎన్నికలు ఏడు దశల పాటు 44 రోజులు జరుగుతున్నాయి. 1951-52లో జరిగిన తొలి ఎన్నికలు నాలుగు నెలల పాటు నిర్వహించారు. ఈ సారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కౌంటింగ్ రోజు వరకు 82 రోజుల టైమ్ ఉంది. భౌగోళిక పరిస్థితులు, పండుగలు, సెలవులు, పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తేదీలను నిర్ణయించారు. 1980లో లోక్ సభ ఎన్నికల కేవలం నాలుగు రోజుల వ్యవధిలో పూర్తయ్యాయి.

పెరుగుతున్న మోదీ పాపులారిటీ…

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వ ఎన్డీయేకు ఘనమైన మెజార్టీ వస్తుందని తాజా సర్వేలు నిగ్గుతేల్చాయి.పాపులారిటీ విషయంలో ప్రధాని మోదీ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉన్నారు.దేశంలోని 76 శాతం మంది ఆయన నాయకత్వానికి జై కొడుతున్నారు. ఈ సారి గెలిచి ఆయన ప్రపంచంలోనే అత్యంత సమర్థ ప్రధానిగా పేరు తెచ్చుకోబోతున్నారు. మన్మోహన్ సింగ్ తర్వాత ఎక్కువ కాలం పదవిలో కొనసాగబోతున్నారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే 16 సంవత్సరాల 286 రోజులు పదవిలో ఉన్నారు. ప్రస్తుత పరిస్తితులు చూస్తే ప్రధాని మోదీ..ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 303 లోక్ సభా స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ కేవలం 52 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇప్పుడు బీజేపీ సొంతంగా 370, ఎన్డీయేకు 400 సీట్లు వస్తాయని ఆశిస్తోంది.