శ్రీకాకుళం జిల్లాలో టిడిపిలో అభ్యర్థుల ప్రకటన పూర్తయిన తర్వాత జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో చిచ్చు రేగింది. శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పాతపట్నంలో కలమట వెంకటరమణకు టిక్కెట్లు నిరాకరించడంతో పార్టీ శ్రేణులు కోపోద్రిక్తులయ్యారు. టిక్కెట్ల ప్రకటన తర్వాత నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు భారీగా కార్యకర్తలు తరలివచ్చి మద్దతు పలికారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. పార్టీ పరిస్థితులు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఇటీవల ఇరువురిని హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడారు.
పాతపట్నం, శ్రీకాకుళంలలో సద్దుమణగని పరిస్థితి
పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పెద్దగా ప్రచారం జరగడం లేదు. రెండు నియోజకవర్గాల్లోని అత్యధిక మంది కార్యకర్తలు ప్రచారం సరిగా జరగడం లేదని, అభ్యర్ధి ఎంపికలో మీరు తప్పు చేశారంటూ పోన్ చేసిన వారికి తిరిగి చెప్తునట్లు తెలిసింది. తమ నియోజకవర్గంలో అభ్యర్థులను మార్చకపోతే కష్టమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పార్టీ నాన్చివేత ధోరణి అవలంభించడంతో శ్రేణుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ రెండు గ్రూపులుగా చీలింది. ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలు, ఇన్‌ఛార్జీలు నిర్వహించే సమావేశాలకు కొంతమంది హాజరవుతుంటే మరికొంతమంది కొత్త అభ్యర్థుల వెంట తిరుగుతున్నారు. తటస్థ కార్యకర్తలు మాత్రం ఎటు వెళ్లాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు. అభ్యర్థుల అంశాన్ని తేల్చకుండా ఎంత నాన్చితే పార్టీకి అంత నష్టం చేకూరుతుందనే అభిప్రాయం పార్టీ నాయకుల నుంచి వినిపిస్తోంది.
కనిపించని పాతపట్నం అభ్యర్థి
పాతపట్నం నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొత్త అభ్యర్థి మామిడి గోవిందరావు కొద్దిరోజులుగా ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. మరో వైపు గ్రూపుల పోరు, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా… వైసిపి అభ్యర్థులు ప్రచారంలో మాత్రం దూసుకు పోవడంతో తమ పరిస్థితేమిటో తెలియకపోవడంతో టిడిపి శ్రేణులు మదనపడుతున్నాయి.ఎవరికీ నొప్పించకుండా ఎంపీ ప్రచారంశ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి మూడోసారి పోటీ పడుతున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎవరినీ నొప్పించకుండా ప్రచారం సాగిస్తున్నారు. సీట్ల పంచాయితీ ఉన్న నియోజకవర్గాలను పక్కనపెట్టి మిగిలిన నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు.
అభ్యర్థుల మార్పు అంశం తేలిన తర్వాతనే అసలు రాజకీయం
పలాస, టెక్కలి, ఆమదాలవలస ప్రాంతాల్లో ప్రచారానికే అధిక సమయం వెచ్చిస్తున్నారు. టిడిపి అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యాక ఇప్పటివరకు శ్రీకాకుళం, పాతపట్నం ని యోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొనలేదు. శ్రీకాకుళం నగరంలో గొండు శంకర్ ఆధ్వర్యాన నిర్వహించిన ర్యాలీకి ఆయన హాజరవుతారని ప్రచారం జరిగినా ఆమదాలవలస, టెక్కలి ప్రాంతాల్లో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల అభ్యర్థుల అంశం తేలిన తర్వాతే ఇక్కడ ప్రచారంలో పాల్గొంటారన్న చర్చ కేడర్‌లో సాగుతోంది.