అనంతపురం టీడీపీలో అసంతృప్తి జ్వాల – సగం స్థానాల్లో ఇండిపెండెంట్లు ఖాయమేనా ?

ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీని చంద్రబాబు నాయుడు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. అభ్యర్థులకు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది అభ్యర్థుల ఎంపికను నిరసిస్తూ ఇప్పటికే కొందరు ప్రత్యర్థి పార్టీలోకి చేరిపోగా, మరికొందరు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

అనంతపురం జిల్లాలో గెలవకపోతే అధికారం కష్టం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 2019 ఎన్నికల్లో 12 అసెంబ్లీ స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌లు ఇద్దరు మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. అనంతపురం, హిందూపురం రెండు పార్లమెంటు స్థానాలను వైసిపి కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరగోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. టీడీపీలో సరైన కసరత్తు చేయకపోవడంతో అసంతృప్తి పెరిగిపోయింది.

బీజేపీకి కేటాయించిన ధర్మవరంలోనూ ఇండిపెండెంట్ గా సూరి

తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమిలో భాగంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం బిజెపికి కేటాయించింది. తక్కిన 13 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు టిడిపి అభ్యర్థులు బరిలోనున్నారు. బిజెపికి కేటాయించిన ధర్మవరం సీటు సత్యకుమార్‌ను బిజెపి అభ్యర్థిగా నిలిపింది. దీంతో జి.సూర్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దింగేందుకు సిద్ధమవుతున్నారు. సూర్యనారాయణ పేరుకు బీజేపీలో ఉన్నా ఆయన చంద్రబాబు ఆదేశాల మేరకే రాజకీయాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనను చంద్రబాబు బుజ్జగించలేకపోతున్నారు.

ఇతర చోట్ల కూడా అసంతృప్తే

ఇతర స్థానాల్లోనూ టిడిపి అభ్యర్థులున్న చోట్ల అసంతృప్తులు కొనసాగుతున్నాయి. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో దుగ్గపాటి వెంకటప్రాసద్‌కు కేటాయించడం పట్ల మాజీ ఎమ్మెల్యే ప్రభకర్‌ చౌదరి అసంతృప్తితోనున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమిలినేని సురేంద్రబాబుకు టిడిపి టిక్కెట్టు ఖరారు చేసింది. దీంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న మాదినేని ఉమామహేశ్వరనాయుడు వైసిపిలో చేరారు. గుంతకల్లు టిక్కెట్టు గుమ్మనూరు జయరాంకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్‌ మద్దతుదారులు సహకరించే పరిస్థితి కన్పించడం లేదు. మడకశిరలో డాక్టర్‌ సునీల్‌కుమార్‌కు కేటాయించడంపై కొంత మంది టిడిపి మద్దతుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక హిందూపురం ఎంపి టిక్కెట్టు దక్కకపోవడంతో మాజీ ఎంపి నిమ్మల కిష్టప్ప పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతానని ప్రకటించారు.