విశాఖ సీటు జీవీఎల్‌కు కేటాయించాలి – పెరుగుతున్న డిమాండ్ !

విశాఖ లోక్ సభ సీటును జీవీఎల్ నరసింహారావుకు కేటాయించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. చాలాకాలంగా ఆయన బూత్ లెవల్లో పార్టీని బలోపేతం చేశారు. అయితే చివరికి ఆయన సీటు పొత్తుల్లో గల్లంతు అయింది. అయితే ఆయన అయితేనే పార్టీకి మేలు జరుగుతుందని… . ఆయనకే అభ్యర్థిత్వం ఖరారు చేయాలని విశాఖ నేతలు ఢిల్లీలో మూడు రోజుల పాటు కీలక నేతలని కలిసి వినతి పత్రం ఇచ్చారు.

ఢిల్లీలో పలుకుబడి ఉన్న నేతగా జీవీఎల్

జీవీఎల్ నరసింహారావుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల విశాఖ అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని సమస్యలను పరిష్కరించిన విషయం కూడా విశాఖ వాసులందరికీ బాగా తెలుసు, మనదేశంలో కేంద్ర మంత్రులు అత్యధికంగా పర్యటనలు చేసిన పార్లమెంట్ నియోజకవర్గం విశాఖపట్నం మాత్రమే. అందుకే బీజేపీ నేతలు ఎంపీగా జీవీఎల్ ఉండాలంటున్నారు.

బీఎల్ సంతోష్ కు విజ్ఞప్తి చేసిన విశాఖ నేతలు

విశాఖలో పార్టీ పరిస్థితిని.. పోటీ చేయకపోతే ఏర్పడే పరిస్థితుల్ని విశాఖ నేతలు ఢిల్లీకి వెళ్లి పార్టీ నేతలకు వివరించారు. విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అత్యధికంగా ఉండడం వల్ల అందులో పని చేస్తున్న నార్త్ ఇండియన్ ఉద్యోగులు, వ్యాపారులు బీజేపీకి అనుకూలంగా ఉంటారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ విశాఖపట్నం పార్లమెంటు సీటును కనీసం కోరుకోలేదని.. ఇతరుల రాజకీయాలకు జీవీఎల్ బలి అయ్యారని వారంటున్నారు.

టిక్కెట్ల మార్పు చేర్పులు జరిగితే మార్పునకు అవకాశం

ఏపీలో పొత్తుల్లో భాగంగా కొన్నిసీట్లలో మార్పు చేర్పులు జరగనున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో మార్పు చేర్పులు జరిగితే జీవీఎల్ కు సీటు కేటాయించేందుకు అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. జీవీఎల్ మాత్రం.. పార్టీ నిర్ణయం ప్రకారమేనని.. ఎలా పోటీ చేసినా ప్రజలు బీజేపీని ఆదరిస్తారని అంటున్నారు.