కర్ణాటక కాంగ్రెస్ నేతల తిరోగమన విధానాలు

దేశం ముందుకు నడుస్తోంది.శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ఘనంగా రాణిస్తోంది. అంతరిక్ష పరిజ్ఞానంలో అమెరికా, రష్యాను దాటిపోయి చాలా రోజులైంది. ఇస్రో రాకెట్ ప్రయోగం చేస్తే గ్రాండ్ సక్సెస్ కావాల్సిందే. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నారు. శాస్త్రవేత్తలుగా ఐఎఎస్,ఐపీఎస్ తో పాటు వ్యాపారరంగాల్లోనూ మహిళలు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వ ఎన్డీయే సర్కారు మహిళలను ప్రోత్సహించడంలో నెంబర్ వన్ గా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం మహిళలు వృద్ధిలోకి రాకూడదని ఆశిస్తోంది. వారిని అణిచివేయాలనే చూస్తోంది…

మహిళలు వంటింటికే పరిమితం కావాలట..

కర్ణాటక కాంగ్రెస్ లో షమ్మనూరు శివశంకరప్ప అనే ముసలి ఎమ్మెల్యే ఒకాయన ఉన్నారు. ఆయన కోడలు ప్రభా మల్లిఖార్జున్ ఇప్పుడు దావనగేరే లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున గాయత్రి సిద్ధేశ్వర పోటీ చేస్తున్నారు. ఆమె ప్రస్తుత బీజేపీ ఎంపీ సిద్ధేశ్వర సతీమణి. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివశంకరప్ప చేసిన కొన్ని వ్యాఖ్యలు గాయత్రి సిద్ధేశ్వరను అవమానించేవిగానూ, సమాజాన్ని తిరోగమన దిశలో నడిపించే ప్రయత్నంగానూ కనిపిస్తున్నాయి. గాయత్రి ఎన్నికల్లో గెలిచి మోదీకి కమలాన్ని బహూకరించాలనుకుంటున్నారని ఆమెకు అంత సీన్ లేదని శివశంకరప్ప ఆరోపించారు. గాయత్రి వంటగదికి పరిమితమై, వంట చేయడానికే పనికొస్తారని రాజకీయాలు ఆమెకు అచ్చిరావని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె రాజకీయాలు వదిలి వెళ్లిపోతే బావుంటుందని శివశంకరప్ప సలహా ఇచ్చారు. ఆమె రాజకీయాలకు పనికిరారన్న సందేశం వచ్చే విధంగా ఆమె మాట్లాడారు…

ముసలోడికి మైండ్ పోయిందంటున్న బీజేపీ

శివశంకరప్ప తీరుపై కర్ణాటక బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయనకు గట్టిగా సమాధానమిచ్చింది. మహిళలు వంటింటి కుందేళ్లుగా మిగిలిపోవాలా అని ప్రశ్నించింది. ఫైటర్ జెట్ పైలట్లుగా మహిళలు రాణిస్తున్న వేళ.. శివశంకరప్ప తిరోగమనవాదం గర్హనీయమని బీజేపీ నేతలు రిటార్చిచ్చారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు ఖబడ్దార్..జాగ్రత్త అని హెచ్చరించారు. తన కోడలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆమె కూడా మహిళే అన్న సంగతి శివశంకరప్ప మరిచిపోయారని కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షురాలు మాళవికా అవినాష్ వ్యాఖ్యానించారు.

శివశంకరప్ప క్షమపణ చెప్పాలి..

తాను మాట్లాడిన మాటలను శివశంకరప్ప వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మహిళా సమాజం మొత్తానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. అసలు ఆయన ప్రపంచాన్ని చూస్తున్నారా లేదా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీరు ఇదేనని కొందరు వాదిస్తున్నారు. మహిళల పట్ల కనీస మర్యాద పాటించని వాళ్లకే కాంగ్రెస్ పార్టీలో పెద్ద పదవులు వస్తాయని కూడా బీజేపీ ఆరోపిస్తోంది. ఇక గాయత్రి సిద్ధేశ్వర సుతిమెత్తగా శివశంకరప్పను మందలించారు. మహిళలు రుచికరంగా వంట చేస్తే భర్త, అత్తమామలు, పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారని ఆమె అన్నారు. ఇంటి పని చేస్తూనే సమాజంలోని వేర్వేరు వృత్తుల్లో మహిళలు రాణిస్తున్నారని ఆమె గుర్తుచేశాయి. ఇంత జరిగినా సీఎం సిద్ధరామయ్య గానీ, ఇతర కాంగ్రెస్ నేతలు గానీ శివశంకరప్ప తీరుపై విచారం వ్యక్తం చేయలేదు…