విజయవాడ వెస్ట్ లో బీజేపీకి అడ్వాంటేజ్ – టీడీపీ బలం పరిమితమే !

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేశారు. నిజానికి అక్కడ జనసేన తరపున పోతిన మహేష్ గట్టిగా పోరాడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా అంగీకరించ తప్పలేదు.

సుజనా వర్సెస్ అసిఫ్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోక్‌సభ పరిధిలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. మొత్తం విజయవాడ పాత నగరం పరిధిలో ఉండే ఈ నియోజికవర్గం పూర్తిగా అర్బన్‌ ప్రాంతం. ప్రస్తుతం వెలంపల్లి శ్రీనివాసరావు వైసీపీ నంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్నారు. వైసీపీ నుంచి షేక్ అసిఫ్‌ కు టిక్కెట్ ఇచ్చారు. అంటే పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్ వైసీపీ పోరు ఖాయమయింది.

టీడీపీ గెలిచింది ఒక్క సారే

సాధారణంగా విజయవాడ అంటే టీడీపీ కంచుకోట అనుకుంటారు. కానీ విజయవాడ సిటీలోని పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎక్కువ సార్లు గెలవలేదు. పొత్తుల్లో భాగంగా ఈ సీటును మిత్రపక్షాలకు కేటాయించేందుకు టీడీపీ ఆసక్తి చూపించేంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1983 లో ఆ పార్టీ గెలిచింది. 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, వామపక్షాల పొత్తులో భాగంగా ఈ సీటు సీపీఐకి కేటాయించారు. టీడీపీ మద్దతు సీపీఐ గెలిచింది కానీ మళ్లీ టీడీపీ అక్కడ గెలిచిన సందర్భం లేదు. మిత్రపక్షాలు మాత్రం గెలిచాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన వెలంపల్లి శ్రీనివాసరావు గెలిచారు. తర్వాత రాజకీయ పరిణామాల్లో ఆయన వైసీపీలో చేరి గత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు నియోజకవర్గానికి దూరమయ్యారు.

ముస్లిం ఓట్లు ఎక్కువే కానీ మెజార్టీ హిందూ ఓట్లు

పశ్చిమ నియోజకవర్గంలో సామాజికవర్గాల పరంగా ఓట్లు కూడా భిన్నంగా ఉంటాయి. ముస్లిం ఓట్లు 40వేల వరకూ ఉంటాయి. కానీ అంతకు రెండింతలు ఇతరుల ఓట్లుఉంటాయి. కాపు సామాజికవర్గం కిందకు వచ్చే నగరాల వర్గం వారి ఓట్లు 40వేలకుపైగానే ఉంటాయి. వైశ్య వర్గానికి చెందిన వారు పద్దెనిమిది, బ్రాహ్మణులు పదివేలు, కమ్మ సామాజికవర్గం వారు ఐదు వేల మంది ఉంటారు. బీజేపీ పోటీ చేయడం వల్ల ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ పోటీ చేసే ప్రతీ చోటా.. కులానికన్నా మతానికి ప్రాధాన్యం లభిస్తుంది. అందుకే సామాజికవర్గంతో సంబంధం లేకుండా సుజనా చౌదరి బరిలోకి దిగడానికి ఆసక్తి చూపించారు.