కొన్ని పూలు పూజకు పనికిరావన్న సంగతి అందరకీ తెలిసిందే. ముఖ్యంగా మల్లెపూలతో పూజ చేయరు…లింగోద్భవ సమయంలో అబద్ధం చెప్పిందనే కారణంతో మల్లెపూవుకి ఆ శాపం ఉంది. ఈ కోవకే చెందుతాయి సంపెంగ పూలు. ఇవి పూజకు ఎందుకు పనికిరావో చెబుతూ ఓ కథ ప్రచారంలో ఉంది…
గోకర్ణ క్షేత్రాన్ని ‘భూకైలాసం’ అని పిలిచేవారు. నారదుడు ఓసారి గోకర్ణం వెళుతూ మార్గ మధ్యలో సంపెగ చెట్టు చూశాడు. ఆ చెట్టు వద్ద ఓ బ్రాహ్మణుడు గిన్నె పట్టుకుని నిల్చుని ఉన్నాడు. నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావని నారదుడు అడిగినా ఆ బ్రాహ్మణుడు సరైన సమాధానం చెప్పలేదు. అలసిపోయి ఇక్కడ నిల్చున్నానన్నాడు. ఆ తర్వాత గోకర్ణంలో మహాబలేశ్వరుడిని సేవించిన తర్వాత తిరిగి వెళుతుండగా కూడా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గర కనిపించాడు. మళ్లీ నారదుడు అదే ప్రశ్నవేసినా సమాధానం రాలేదు. సంపంగి చెట్టుని ప్రశ్నించినా కానీ సరైన కారణం తెలియలేదు. అంతకుముందే ఆ బ్రాహ్మణుడు తన గురించి చెప్పొద్దని సంపెంగ చెట్టుని కోరడంతో ఆ చెట్టుకూడా అబద్ధం చెప్పింది.
సందేహంతో నారదుడు తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరకు వెళ్లి చూడగా…సంపంగి పూలు స్వామి చుట్టూ కనిపించాయి. అక్కడే ధ్యానం చేసుకుంటున్న ఓ బ్రాహ్మణుడిని పిలిచి అడిగితే… ఓ దుష్ట బ్రాహ్మణుడు వచ్చి అర్చించాడని చెప్పాడు. అంతేకాదు..ఆ దుష్ట బ్రాహ్మణుడు సంపెంగ పూలతో శివుడిని అర్చించిన ఫలితంగా ఈ దేశ రాజు కూడా ఆయనకు దాసోహం అయ్యాడు, ఆ కపట భక్తుడు ప్రజల్ని పీడిస్తున్నాడని చెప్పాడు. అదే సమయంలో ఓ మహిళ వద్ది పరమేశ్వరుడిని ఇలా వేడుకుంటోంది. ఏం జరిగిందని నారదుడు అడిగితే… తన భక్త అవిటివాడు, కుమార్తె వివాహానికి రాజు సహాయం చేశాడు కానీ ….ఓ దుర్మార్గ బ్రాహ్మణుడు అవి లాక్కున్నాడని చెప్పి కన్నీళ్లుపెట్టుకుంది.
తిరిగి సంపెంగ చెట్టు దగ్గరకు వెళ్లిన నారదుడు ఏం జరిగిందో చెప్పమని నిలదీస్తాడు… అయినా చెప్పకపోవడంతో… ఈ పూలంటే శివుడికి అత్యంత ప్రీతికరం. వీటితో పూజ చేసి ఆ దుష్టుడు చెడ్డ పనులు చేస్తున్నాడు…అన్నీ తెలిసి కూడా నువ్వు అబద్ధం చెప్పినందుకు ఇకపై శివుడి పూజకు ఈ పూలు పనికిరావని శపించాడు. ఆ కపట బ్రాహ్మణుడు రాక్షసుడిగా జన్మిస్తాడనే శాపం ఇచ్చి..త్రేతాయుగంలో శ్రీరాముడి చేతిలో మరణించాక శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు. అలా అప్పటి నుంచి సంపంగి పువ్వు పూజకు పనికిరాకుండా పోయింది…
గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..