ఆజంఘర్ – నిన్నటి కాంగ్రెస్ కంచుకోటపై నేడు బీజేపీ గురి…

ఉత్తర ప్రదేశ్లోని 80 నియోజకవర్గాల్లో ఆజంఘర్ కీలకమైనదిగా చెప్పాలి. సమాజ్ వాదీ పార్టీని పూర్తిగా దెబ్బకొట్టాలంటే ఆజంఘర్ లో బీజేపీ గెలిచి తీరాల్సిన అనివార్యత ఉంది. పైగా ఈ సారి ప్రధాని మోదీ ఆ స్థానంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. స్థానిక నేతలను ఉత్తేజ పరుస్తూ.. విజయావకాశాలను బేరీజు వేయడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం తగదని ఆదేశించారు…

ప్రస్తుతం కమలం చేతిలో…

2014లో ఆజంఘర్ స్థానం ఎస్పీ కైవశమైంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అక్కడ గెలిచారు. 2019లో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ విజయం సాధించారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత ఆజంఘర్ లోక్ సభను ఆయన వదులుకుని అసెంబ్లీకి పరిమితమయ్యారు. 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ గెలవడంతో అక్కడ కాషాయ జెండా పాతినట్లయ్యింది. నిజానికి 1952 నుంచి 1971 వరకు ఆజంఘర్ కాంగ్రెస్ చేతిలో ఉండేది. 1977లో జనతా పార్టీ గెలిచింది. 1978లో మళ్లీ కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. అలా ఆజంఘర్ చేతులు మారుతూ వచ్చింది…2009లో బీజేపీ అక్కడ తొలి సారి గెలిచింది. ఒక సారి బీఎస్పీ కూడా అక్కడ విజయం సాధించిన మాట వాస్తవం…

ప్రాజెక్టులు ప్రకటించిన మోదీ…

ఆజంఘర్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన కారణంగా బీజేపీ ఎలక్షనీరింగ్ ప్రారంభించి చాలా రోజులైంది. మోదీ మ్యాజిక్ తో గెలవాలని ఆ పార్టీ అనుకుంటోంది. మార్చి 10న ఆజంఘర్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ అక్కడ రూ. 34,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సారి బీజేపీకి 400 సాధించిపెట్టడంతో ఆజంఘర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ప్రకటించారు. మోదీ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత మొత్తం నాలుగు సార్లు ఆజంఘర్ పర్యటించారు. వచ్చినప్పుడల్లా ఏదోక తాయిలం అందిస్తూనే ఉన్నారు..

సామాజిక సమీకరణాలే కీలకం…

ఆజంఘర్ లో గెలవాలంటే సామాజిక సమీకరణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆజంఘర్ 46 లక్షల జనాభా ఉంది. అందులో పాతిక లక్షల మంది ముస్లింలు, యాదవులు, దళితులే కావడం విశేషం. ఐదు లక్షల వరకు ఓబీసీ జనాభా ఉంటుంది. స్వాతంత్ర్యం తర్వాత ముస్లింలు కాంగ్రెస్ పక్షం వహించేవారు. ములాయం సింగ్ యాదవ్.. సమాజ్ వాదీ పార్టీని స్థాపించిన తర్వాత ముస్లిం ఏకమొత్తంగా ఎస్పీ వైపుకు వెళ్లిపోయారు.ఎస్పీ ఇప్పుడు పీడీఏ ఫార్ములాను ప్రచారం చేస్తోంది. అంటే పిఛడా, దళిత్, అల్పసంఖ్యాక్ (పీడీఏ) అని అర్థం. కాకపోతే ఇప్పుడు రామాలయ నిర్మాణం తర్వాత హిందూవర్గాల్లో బీజేపీ పట్ల విశ్వాసం మరింతగా పెరిగింది. పైగా ఇప్పుడు ఆజంఘర్ లో బీజేపీ ఎంపీ ఉండటం కూడా ఒక రకంగా కలిసొచ్చే అంశం.