ఇంటింటికీ పెన్షన్ల పంపిణీపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంటింటికీ పంపిణీ కుదరని పక్షంలో.. డీబీటీల రూపంలో చెల్లించాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ కుదరదని ఈసీకి సీఎస్ తెలిపారు. ఏప్రిల్‌లో చేసినట్లే చేస్తామని వెల్లడించారు. దీంతో తాజాగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎండలో వృద్ధులు పెన్షన్ల కోసం వచ్చి నిరీక్షించి చనిపోతున్నారన్న ఆరోపణలు రావడతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మార్చి 30న ఈసీ కీలక ఆదేశాలు
పెన్షన్లు సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న ఎన్నికల సంఘం జారీ చేసింది. ఆ మార్గదర్శకాలను అమలు చేయాలని సీఎస్‌కు ఈసీ తెలిపింది. పెన్షన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎక్కడా వలంటీర్లను వాడుకోవద్దని ప్రత్యామ్నాయంగా మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా వృద్ధులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్డీఏ కూటమి వరుస ఫిర్యాదులు స్పందించిన ఈసీ
. పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని.. లబ్ధిదారులు కూడా చాలా ఇబ్బందులకు గురైనట్టు తన దృష్టికి వచ్చిందని వెల్లడించింది. శాశ్వత ఉద్యోగులు, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయవచ్చని గత మార్గదర్శకాల్లోనే సూచించామని తెలిపింది. పింఛన్ సహా, నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులకు మాత్రమే వినియోగించుకోవాలని.. ఇంటింటికీ పెన్షన్లను పంపిణీ చేసేందుకు వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఆదేశించింది
వృద్దుల మరణాలతో వివాదం
ఏప్రిల్ నెల పెన్షన్లను సచివాలయాల వద్ద పంపిణీ చేయడంతో వడ దెబ్బ తగిలి 32 మంది వృద్ధులు చనిపోయారన్న ఆరోపణలు వచ్చాయి. రాజకీయంగా ఈ వృద్ధులు చనిపోవడం కలకలానికి రేపింది. అయితే ప్రభుత్వం మాత్రం వారెవరూ పించన్ల కోసం వచ్చి చనిపోలేదని తాజాగా ఈసీకి చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై కూటమి నేతలు ఈసీని కలిశారు.