ప్రొద్దుటూరులో పెద్దాయన చివరి ప్రయత్నం – వరదరాజులరెడ్డి హవా ఉంటుందా ?

2024 సార్వత్రిక ఎన్నికల బరిలో వైసిపి తరుపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, టిడిపి తరుపున కురువృద్ధుడైన మాజీ ఎమ్మెల్యే ఎన్‌.వరదరాజులరెడ్డి నిలిచారు. వీరిద్ధరు ఒకప్పటి గురుశిష్యులు కావడం ఎన్నిక ప్రత్యేకతను సంతరించుకుంది. వైసిపి అభ్యర్థి రాచమల్లు పార్టీ సంస్థాగత బలం, బలగంతోపాటు మహిళా ఓటర్లలో సానుకూలత ఆధారంగా ముందుకు సాగుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యే గెలిచిన వరదరాజులరెడ్డి చివరి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అంటున్నారు.

హోరాహోరీ పోరు

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2.20 లక్షలు ఓటర్లు ఉన్నారు. ప్రొద్దుటూరు అర్బన్‌, రాజుపాలెం మండలాలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో పెద్దసంఖ్యలో అర్బన్‌ ఓటర్లు ఉన్నారు. రాజుపాలెం మండలం గత ఎన్నిక మినహా సహజంగా టిడిపి ఆధిక్యత కలిగిన ప్రాంతం కావడం, అర్బన్‌లో వైశ్య సామాజికవర్గంలో సానుకూలత ఉండడం టిడిపికి ఊరట కలిగిస్తోంది. మరోవైపు వైసిపి అభ్యర్థికి కొత్తపల్లి పంచాయతీలో తటస్థత, సోములవారిపల్లి, గోపవరం మండలాల్లో సానుకూలత లభించే అవకాశం కనిపిస్తోంది. వైసిపి సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాల దన్నుతో ముందుకు సాగుతుండడంతో అసెంబ్లీ ఎన్నిక క్లిష్టమైన పోటీని తలపిస్తోంది.

సోషల్ ఇంజినీరింగ్ పై వైసీపీ దృష్టి

సోషల్‌ ఇంజినీరింగ్‌పైనే దృష్టి వైసిపి సోషల్‌ ఇంజినీరింగ్‌పై ఆధారపడి ఎన్నికల యుద్ధానికి శ్రీకారం చుట్టింది. వైసిపి అభ్యర్థి రాచమల్లు ఆయా సామాజికవర్గాల ఓటర్ల వారీ లెక్కల ఆధారం చేసుకుని గెలుస్తామనే ఆశలు పెంచుకున్నారు. వైసిపి సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాల దన్నుతో పేదప్రజల ఓట్లను నమ్ముకుని ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణ తరహాలో రూరల్‌ ప్రాంతాల్లో పట్టు కలిగిన పార్టీ అధికారంలోకి వచ్చిన తీరు నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. టిడిపి అభ్యర్థి ఎన్‌.వరదరాజులరెడ్డి అర్బన్‌ ఓటర్లు, కూటమి ఓటర్ల అండతో గెలుస్తామనే ధీమాతో ముందుకు సాగుతున్నారు.

వైసీపీ అభ్యర్థికి అసమ్మతి సమస్య

వైసిపి అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మధ్య అసమ్మతి పతాకస్థాయికి చేరుకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ ఎమ్మెల్యేతో విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ప్రొద్దుటూరు పర్యటన సందర్బంగా టిడిపి అభ్యర్థి ఎన్‌.వరదరాజులరెడ్డి వైసిపి అసమ్మతిన నాయకులైన కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి టిడిపి తీర్థం ఇప్పించారు. . 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున బరిలో నిలిచిన అభ్యర్థికి 2,300 ఓట్లు లభించాయి. ఈ సారి షర్మిల ప్రచారం చేస్తూండటమే ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఎవరికి ఆ ఓట్లు కోత పడతాయన్నది కీలకం.