సాలూరులో మరోసారి పాత ప్రత్యర్థుల పోటీ – ఈ సారైనా టీడీపీ అభ్యర్థి గెలుస్తారా ?

సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టిపోటీ కనిపిస్తోంది. బరిలో ఎంతమంది వున్నా ప్రధాన పోటీ సంధ్యారాణి, రాజన్నదొర మధ్యనే వుంటుందనేది స్పష్టం గా కనిపిస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన గుమ్మిడి సంధ్యారాణికి ఈసారి ఎన్నికల్లో సానుభూతి పవనాలు వీస్తాయనే ప్రచారం జరుగుతోంది.

టీడీపీలో గ్రూపు రాజకీయాలు

టిడిపిలో గ్రూపు రాజకీయాలు బలంగా వున్నప్పటికీ ఆమె సానుభూతి పవనాలు కూడగట్టుకునే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా ఓటర్ల సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడుసార్లు ఓడిపోయానని, ఆర్థికంగా నష్టపోయానని చెపుతూ ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆమె కోరుతున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందనేది ఆమె చెప్పడం లేదు. కానీ వైసిపి ప్రభుత్వం హయాంలో ఏమీ అభివృద్ధి జరగలేదని, ఎమ్మెల్యే గా రాజన్నదొర ఏమీ చేయలేదని చెబుతున్నారు.

కూటమిపై సానుకూలత – ప్రభుత్వంపై వ్యతిరేకత

వైసిపి ప్రభుత్వం పై వ్యతిరేకత, సిటింగ్‌ ఎమ్మెల్యే రాజన్నదొర పై అసంతప్తి తనకు లాభిస్తాయనే అంచనాలతో ఆమె ఉన్నారు.గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా, ఇప్పుడు వైసిపి ఎమ్మెల్యే గా మంత్రిగా నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైనే వైసిపి అభ్యర్థి రాజన్నదొర ఆశలు పెట్టుకున్నారు. 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా తాను ఎక్కడ ఏ అభివృద్ధి పనులు చేశారో చెబుతున్నారు. ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పేదలకు అందజేసిన సంక్షేమ పథకాల లబ్ధి గురించి వివరిస్తున్నారు. నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలకు రహదారులు ,వంతెనలు నిర్మించడంలో రాజన్నదొర కీలకపాత్ర పోషించానని చెబుతున్నారు.

గిరిజనులు తనవైపు ఉంటారంటున్న రాజన్న దొర

నిజమైన గిరిజనుడిగా గిరిజనులు తనవైపు వుంటారనే నమ్మకం తో ఆయన వున్నారు. సుధీర్ఘ కాలం ఎమ్మెల్యే గా చేయడం వల్ల ఆయన పై కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. దానిని అధిగమించి మరోసారి విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు. . గిరిజన ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా, అటవీ హక్కుల చట్టం అమలుకు, భూ అక్రమాలు ఓటింగ్ లో కీలకం కానున్నాయి.