పడమటి ముస్లింలు బీజేపీ పక్షం….

మనం కృష్ణా గోదావరి మధ్య దేశే అంటూ ఉంటాం. అక్కడి జనం గంగా -యమునా మధ్య దేశే అనుకుంటారు. దాన్ని మరో విధంగా గంగా – యమునా తెహజీబ్ అని కూడా పిలుస్తారు. అది పడమటి ఉత్తర ప్రదేశ్ ప్రాంతం. అక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉంటారు. ఇంతకాలం వేర్వేరు పార్టీలకు ఓట్లు వేసి మోసపోయామంటున్న వాళ్లు ఇప్పుడు మాత్రం దృఢనిశ్చయంతో ఉన్నారు…

మా ప్రాంతం శాంతియుతంగా ఉంది..

బడా బాబులే కాదు. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్లు..చిరు వ్యాపారులు కూడా ఇప్పుడు బీజేపీకి జై కొడుతున్నారు. దేశంలో పదేళ్ల బీజేపీ పాలనతో పాటు ఉత్తర ప్రదేశ్లోని యోగీ ప్రభుత్వం వల్ల డబుల్ ఇంజిన్ సర్కారు సమర్థంగా పనిచేస్తోందని జనం చెప్పుకుంటన్నారు. కైరానా, ముజఫర్ పూర్, సహరాన్పూర్, రాంపూర్, మొరాదాబాద్ ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. వాళ్లంతా ఇంత కాలం ఎస్పీ – కాంగ్రెస్ పొత్తుకు ఓటేస్తూ వచ్చారు. కొంతమంది బీఎస్పీకి కూడా ఓటేశారు. ఇప్పుడు మాత్రం తమ ఆలోచనను మార్చుకునేసి బీజేపీ వైపుకు మొగ్గుచూపుతున్నారు…

ప్రభుత్వ పథకాలు, శాంతి భద్రతలు

ముస్లింలు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి నిర్దిష్టమైన కారణాలే ఉన్నాయి. ప్రభుత్వ పథకాల వల్ల వాళ్లకు ఎనలేని ప్రయోజనం కలిగిన మాట వాస్తవం. శాంతి భద్రత పరిస్థితి మెరుగుల పడిందని జనం ఒప్పుకుంటున్నారు. ఒకప్పుడు ముస్లింలు ఉండే ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు ఉండేవి కావు. బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి మెరుగుపడిందని జనం ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎన్డీయే క్యాంపులో షఫీక్ అహ్మద్ అన్సారీ అనే ముస్లిం ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆయన రాంపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాను ప్రభుత్వంతో మాట్లాడి ముస్లిం ప్రాంతాలన్నింటికీ ఉజ్వల్ స్కీమ్ కింద మంచినీరు అందే ఏర్పాటు చేశానని ఆయన చెబుతున్నారు. ఇదివరకు బీజేపీకి ముస్లింలు దూరంగా ఉండేవారు. ఇప్పుడు మోదీ – యోగి కాంబినేషన్ లో వాళ్లు కమలం పార్టీ కార్యకర్తలతో కలిసిపోతున్నారు. కొందరు ముస్లిం పెద్దలు తరచూ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కలుసుకుని తమ ప్రాంత సమస్యలను విన్నవించి పరిష్కరించాలని కోరుతున్నారు. పైగా బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో కూడా ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఈ సారి విశేషమని చెప్పాలి.

మహిళలకు పూర్తి రక్షణ..

త్రిపుల్ తలాఖ్ రద్దు ఉత్తర ప్రదేశ్ ముస్లిం మహిళలకు వర ప్రదాయినిగా పరిణమించింది. వారికి గౌరవంగా బతికే అవకాశం లభించింది. పైగా ముస్లిం అమ్మాయిలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని ఆయా వర్గాలే అంగీకరిస్తున్నాయి.గతంలో పార్టీల పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్న ముస్లిం మహిళలు ఇప్పుడు మాత్రం మోదీ నాయకత్వంపై పూర్తి విశ్వాసంలో ఉన్నారు. పడమటి యూపీలో ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది..