పేదరిక నిర్మూలన – రాహుల్ తీరుపై మోదీ ఆగ్రహం

రాహుల్ గాంధీ ఏ పని చేసినా చివరకు అభాసుపాలవుతుంటారు. ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారింది. మీరు మాట్లాడుతున్నది తప్పు..అసలు సంగతి ఇదీ అని ఎంతమంది వివరించినా రాహుల్ గాంధీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఆయన్ను భారత రాజకీయాల్లో పప్పు అని పిలిస్తారు. తాజాగా పేదరిక నిర్మూలన అంశంలో ఇష్టానుసారం మాట్లాడి ఆయన ప్రధాని మోదీ దగ్గర చీవాట్లు తిన్నారు..

ఒక దెబ్బకు పేదరికాన్ని రూపుమాపుతాం…

రాహుల్ గాంధీ మాటలు కోటలు దాతటాయి. చేతలు గుమ్మాలు దాటవు. ఈ క్రమంలో ఆయన ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఒక దెబ్బకు పేదరికం మటుమాయం చేస్తామని ఆయన తాజాగా ప్రకటించారు. ప్రతీ పేద వాడి ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తే పేదరికం పారిపోతుందని కొత్త భాష్యం చెప్పారు.

పేదలను అవమాన పరిచారు..

రాహుల్ గాంధీ తీరుపై ప్రధాని మోదీ మండిపడటమే కాకుండా అలాంటి నిర్హేతుకమైన హామీలు ఇస్తున్నందుకు మందలించారు. కొన్ని సెటైర్లు కూడా వేశారు. రాహుల్ ఇప్పుడు మాంత్రికుడిగా, ఇంద్రజాలికుడిగా మారారని మోదీ ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జనం పేదరికంలో మగ్గుతుంటే రాహుల్ ఎక్కడ నిద్రపోతున్నారని ఆయన ప్రశ్నించారు. యాభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాల్సిన బాధ్యత రాహుల్ పై ఉందన్నారు. అప్పట్లో ఆయన నానమ్మ గరీబీ హఠావో అన్నారని, ఆమె హయాంలో ఒక్క పేదవాడికి కూడా ప్రయోజనం కలగలేదని మోదీ చెప్పారు. రాహుల్ కుటుంబానికి రిమోట్ ద్వారా ప్రభుత్వాలు నడపటం మాత్రమే తెలుసని, 2004 నుంచి 2014 వరకు వాళ్లు అదే పని చేశారని, అలాగని పేదరికాన్ని పారద్రోలే మంత్రదండం మాత్రం వారి దగ్గర లేదని మోదీ కుండబద్దలు కొట్టారు. అందుకే దేశ ప్రజలు వారిని సీరియస్ గా తీసుకోవడం మానేశారని ఆయన అన్నారు. అసలు రాహుల్ గాంధీ ఆయన కుటుంబం దేశంలోని పేదల పరిస్థితిని అపహాస్యం చేస్తున్నారని మోదీ గుర్తు చేశారు..

బీజేపీతోనే పేదల సంక్షేమం…

దేశంలో పేదల సంక్షేమానికి బీజేపీ మాత్రమే పనిచేయగలదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. మోదీకి గ్యారెంటీ 2024 పేరుతో తాము విడుదల చేసిన మేనిఫెస్టో అనేక పేదరిక నిర్మూలనా అంశాలున్నాయని వారు గుర్తుచేశారు. గ్యాన్ అంటే .. గరీబ్, యువ, అన్నదాత, నారీ కోసం ప్రత్యేక కార్యక్రమాలుంటాయని అన్నారు. మహిళలు, యువకులు, రైతులు, పేదల అభ్యున్నతికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పేందుకు మేనిఫెస్టోలో అనేక అంశాలు పొందుపరిచారు. కనిష్టంగా పాతిక కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి వారి ఆదాయాలు పెంచామని బీజేపీ చెబుతోంది. పేదవారి కడుపు నింపడం, వారి పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం తమ ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉందని కూడా మోదీ మహాశయుడు ప్రకటించేశారు. మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ కొనసాగిస్తామని పార్టీ ప్రకటించింది.కడుపు నిండా అన్నమే కాదు..తాగేందుకు నీరు అవసరం. అందుకే హర్ ఘర్ కో జల్ స్కీము కొనసాగుతుందని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పనులేమీ చేయకుండా పేదరికాన్ని పారద్రోలే మంత్రదండం తమ దగ్గర ఉందని చెప్పుకుంటోంది.ఇలాంటి చర్యలు రాహుల్ గాంధీకి సిగ్గుచేటే కదా….