వారణాసి లోక్ సభా స్థానం దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 2014లో ప్రధాని మోదీ అక్కడ నుంచి పోటీ చేసినప్పుడు 3.7 లక్షల మెజార్టీ సాధించారు. అప్పుడాయన ప్రధానమంత్రి అభ్యర్థి. ప్రధానిగా 2019లో బరిలోకి దిగినప్పుడు ఆయనకు 4.8 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ సారి ఆధిక్యం మరింతగా పెరుగుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. మోదీకి కనిష్టంగా పది లక్షల ఓట్లు వస్తాయని, మెజార్టీ ఏడు లక్షలు దాటుతుందని బీజేపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.
పదేళ్ల అభివృద్ధే గీటురాయి…
ప్రధానమంత్రిగా మోదీ ఎంత బిజీగా ఉన్నా కూడా, జాతీయ స్థాయిలో స్పాట్ లైట్ ఉన్నా సరే… తన సొంత నియోజకవర్గం వారణాసిని మాత్రం ఆయన ఎన్నడూ మరిచిపోలేదు. ఉదయం లేవగానే వారణాసి వ్యవహారాలు, అక్కడి సమస్యలు, అక్కడి అభివృద్ధిపై ఆయన కొంత సమయం కేటాయిస్తారు. ఈ క్రమంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. అందులో దేశవిదేశ భక్తులు వచ్చే కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం ప్రధానమైందిగా చెప్పాలి. వారణాసి రింగ్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయ్యింది. రోడ్లు, వంతెనలు కట్టారు. కేన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయి….
మోదీతో ఒక ఎమోషనల్ కనెక్షన్…
వారణాసి ప్రజలకు, అక్కడి పర్యాటకులకు ప్రధాని మోదీతో ఓ ఎమోషనల్ కనెక్షన్ ఉందనే చెప్పాలి. మోదీ పేరు చెబితే వాళ్లు పరవశించిపోతారు. మోదీ గుజరాతీ అయినా ఆయన్ను తమవాడిగా పరిగణిస్తామని కాశీ పురి వాసులు ప్రకటిస్తున్నారు. ప్రధానిగా పవిత్ర నగరానికి ఆయన 50 సార్లకు పైగా వచ్చివెళ్లారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ ద్వారా వారణాసి నగరాన్ని శుభ్రపరచడం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జనం అంగీకరిస్తారు. మోదీ చర్యల వల్లే పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందిందని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు.
ప్రపంచ నాయకుడిగా దేశ ప్రతిష్ట కోసం…
మోదీ ఇప్పుడో ఐకాన్. ఆయన వరల్డ్ లీడర్. దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్న దార్శనికుడు. ఎక్కడికి వెళ్లినా భారత్ మాతాకీ జై అని నినదించే దేశ భక్తుడు. హిందూ మతం కోసం ఆయన చేస్తున్న సేవలను గుర్తించే మోదీకి ఓటేస్తున్నామని బెనారెస్ జనం మూకుమ్మడిగా చెబుతున్నారు. ఇంకోసారి అధికారానికి వచ్చి మరిన్ని ఆలయాలను నిర్మిస్తారని ఎదురుచూస్తున్నారు. ఉద్యోగకల్పనలో, అవినీతి నిర్మూలనలో, ద్రవ్యోల్బణ నియంత్రణలో, దేశ సమస్యల పరిష్కారంలో మోదీ సేవలు అమోఘమని అందుకే వారణాసి ప్రతినిధిగా ఆయన్ను గౌరవిస్తామని స్థానిక ప్రజలు ప్రకటిస్తున్నారు. జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరుగుతున్న వేళ మెజార్టీ వర్గం మోదీకి ఓటేసేందుకు రెడీ అవుతోంది..