నీలగిరి కొండల్లో కమలం ఊపు…

తమిళనాట బీజేపీ కొత్త చరిత్రకు తెరతీయబోతోంది. 1990ల్లో సాధించిన ఐదు స్థానాలను ఈ సారి రెట్టింపు చేసుకోవాలన్న కోరికతో ప్రచార వ్యూహాలు రచించింది. ప్రధాని మోదీ నుంచి అగ్రనేతల అందరూ తమిళనాడులోకి వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. ఉత్తర తమిళనాడుది ఒక ట్రెండ్ అయితే … దక్షిణ తమిళనాడులోని కోయంబత్తూరు, నీలగిరి నియోజకవర్గాలు మరో ట్రెండ్…

పేరుకే చతుర్ముఖ పోటీ…

తూర్పు, పడమటి కనుమల సంగమ ప్రదేశం నీలగిరి. అక్కడ అందమైన హిల్ స్టేషన్స్ చూస్తేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సాంస్కృతిక అభివృద్ధే కాకుండా జీవ వైవిధ్యం కూడా అక్కడ ఎక్కువగానే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఈ సారి నాలుగురు బలమైన అభ్యర్థులు కనిపిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్ అయిన ఆ నియోజకవర్గంలో డీఎంకే తరపున కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజా (2జీ కేసు నిందితుడు) బీజేపీ తరపున ఎల్. మురుగున్, అన్నాడీఎంకే తరపున లోకేశ్ తమిళ్ సెల్వన్, నామ్ తమిళర్ కట్చి తరపున ఏ. జయకుమార్ బరిలో ఉన్నారు. ప్రధానంగా పోటీ డీఎంకే, బీజేపీ మధ్యనే ఉంటుంది. అక్కడ అన్నాడీఎంకే పూర్తిగా దెబ్బతిన్నది…

డీఎంకే అధికార దుర్వినియోగంపై పోరాటం..

తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడు ప్రతీ లోక్ సభా నియోజకవర్గంలోనూ రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వాధికారులు కూడా డీఎంకేకు అనుకులంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు మాత్రమే కాకుండా సాక్ష్యాలు కూడా దొరికాయి. డీఎంకే కుటుంబ పాలన, డీఎంకే అవినీతి, డీఎంకే ఆశ్రిత పక్షపాతంపై బీజేపీ అభ్యర్థి ఎల్ మురుగన్ చాలా రోజులుగా ఫైట్ చేస్తున్నారు. గత దశాబ్దం కాలంగా నీలగిరిలో బీజేపీ శాఖలు బలపడ్డాయి. బూత్ లెవల్ కార్యకర్తలను ఎప్పటికప్పుడు అధిష్టానం ప్రోత్సహిస్తూనే ఉంది. స్థానిక ప్రజల సమస్యల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రం అమలు చేస్తున్న తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫిర్యాదు అందిస్తున్నారు. డీఎంకే ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎల్. మురుగన్ నేతృత్వంలో పెద్ద ధర్నా పోరాటమే జరిగింది.

బీజేపీ వైపు తెగల చూపు..

నీలగిరి పర్వత ప్రాంతాల్లో తెగలు ఎక్కువగా ఉన్నాయి. అందులో బలమైన బడగ తెగ ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపుకు మొగ్గుచూపుతున్నారు. అక్కడి తెగల అభివృద్ధికి, వారి విద్యా-ఉపాధి-వికాసం కోసం బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. నీలగిరి కొండల్లోని 40 శాతం జనాభా బడగలేనని చెప్పాలి. ఇక నియోజకవర్గంలో రెండున్నర లక్షల మంది శ్రీలంక తమిళులున్నారు. వారి ఇంతవరకు డీఎంకేకు మద్దతిచ్చినా ఈసారి బీజేపీ వైపుకు చూస్తున్నారు. నీలగిరి ప్రాంతంలో 15 వేల ఏనుగులున్నాయి. వాటి ఆవాసమైన అడవిలోకి జనం వెళ్లిపోయి లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారు. మానవుడు- వన్యమృగానికి మధ్య జరిగే సంఘర్షణ ఇకపై పునరావృతం కాకుండా చూస్తామని బీజేపీ హామీ ఇస్తోంది. నీలగిరి ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. నీలగిరిలో రేపే అంటే ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది..